Most Runs in IPL up to 99 Matches: ఏ ఫార్మాట్‌లోనైనా వంద మ్యాచ్‌లు ఆడటమంటే ప్రత్యేకమే. అదీనూ ఒకే లీగ్‌లో ఆ ఘనత సాధించాలంటే.. కొన్నేళ్లుగా నిలకడైన ఆటతీరును ప్రదర్శించాలి. అయితే వందో మ్యాచ్ ముందు వరకు (99) ఆడిన మ్యాచుల్లో భారీగా పరుగులు చేసిన వారి జాబితాలో ఇద్దరు టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఉన్నారు. వారిలో ఒకరు మాజీ కాగా.. ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్.. ఇంతకీ ఈ లిస్ట్‌లోని భారత ప్లేయర్లు ఎవరు.. మొదటి స్థానంలో ఉన్న .. ఆ తర్వాతి బ్యాటర్లు ఎవరనేది తెలుసుకుందాం..
- క్రిస్ గేల్: బంతి దొరికితే చాలు బౌండరీ ఆవలకు పంపించేందుకు సుడిగేల్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మరి అలాంటి క్రిస్ గేల్ ఫామ్‌లో లేకపోవడం వల్ల ఈ సారి ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. అయినా ఇప్పటికీ గేల్ మీద రికార్డులు ఉండటం విశేషం. గత సీజన్ వరకు 142 మ్యాచ్‌లను ఆడిన గేల్ ఆరు శతకాలు, 31 అర్ధశతకాలతో 4,965 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 175 నాటౌట్. ఇలాంటి క్రిస్ గేల్ 99 మ్యాచ్‌లు ఆడేటప్పటికి 3,578 పరుగులు చేసి ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు.
- కేఎల్ రాహుల్: ప్రస్తుతం జరుగుతున్న టీ20 లీగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఒకడు. గత సీజన్‌లోనూ అద్భుతంగా రాణించాడు. లఖ్‌నవూ సారథ్య బాధ్యతలను స్వీకరించిన రాహుల్ ఇవాళ (ఏప్రిల్ 16) ముంబయితో జరుగుతున్న మ్యాచ్ వందో గేమ్. ఈ క్రమంలో ఇప్పటివరకు 99 మ్యాచ్‌లను ఆడిన కేఎల్ రాహుల్ 3405 పరుగులు చేశాడు. దీంతో 99 మ్యాచ్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక తన వందో మ్యాచ్‌లో రాహుల్ (103*) సెంచరీ చేశాడు.
- డేవిడ్ వార్నర్: మొన్నటి వరకు హైదరాబాద్ జట్టు తరఫున కీలక ప్లేయర్‌గా మారిన డేవిడ్ వార్నర్ ఈసారి దిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 99 మ్యాచ్‌ల తర్వాత వార్నర్ 3,304 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు డేవిడ్ వార్నర్ టీ20 లీగ్ కెరీర్‌లో 145 మ్యాచ్‌లకుగాను 5,351 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 126*.
- డుప్లెసిస్: బెంగళూరును విజయపథంలో నడిపిస్తోన్న డుప్లెసిస్ బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఐదు మ్యాచుల్లో 88 అత్యధిక స్కోరుతో 146 పరుగులు చేశాడు. 99 మ్యాచ్‌ల్లోనే 2,849 పరగులు సాధించాడు. ఇప్పటి వరకు 105 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్ 130 స్ట్రైక్ రేట్‌తో 3,081 పరుగులు చేశాడు. డుప్లెసిస్ అత్యధిక స్కోరు 96. ఇందులో 23 అర్ధశతకాలు ఉన్నాయి.
- సురేశ్ రైనా: గత సీజన్ వరకు చెన్నై జట్టులో 'చిన్న తలా'గా పేరుగాంచిన సురేశ్ రైనాకు ఈసారి చుక్కెదురైంది. మెగా వేలంలో ఎవరూ దక్కించుకోలేదు. ఇప్పటివరకు టీ20 లీగ్ చరిత్రలో 200 మ్యాచ్‌లు దాటిన వారిలో రైనా (205) ఒకడు. ఒక శతకం, 39 అర్ధశతకాలతో 5,528 పరుగులు చేసిన రైనా అత్యుత్తమ స్కోరు 100 నాటౌట్. స్ట్రైక్‌రేట్ 136.76 కావడం విశేషం. మరి అలాంటి రైనా తన 99 మ్యాచ్‌ల తర్వాత 2,802 పరుగులను చేశాడు. అయితే గత రెండేళ్లుగా సరైన ఫామ్‌లో లేకపోవడం సురేశ్ రైనాకు టీ20 లీగ్‌లో స్థానం దక్కకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పాలి.
ఇదీ చూడండి: ఓటముల్లో ముంబయి 'డబుల్ హ్యాట్రిక్'.. టోర్నీ నుంచి ఔట్!