ఐపీఎల్ దగ్గరపడుతున్నకొద్దీ ఫ్రాంచైజీలకు కరోనా భయం పట్టుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్ బృందంలోని ఒకరికి శనివారం పాజిటివ్ వచ్చింది. ఆటగాళ్లు, సహాయ బృందంలోని వారు కాకపోవడం వల్ల ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్‌కు వైరస్ రావడం కలకలం సృష్టించింది.
గతేడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించారు. అక్కడికి చేరుకున్న కొద్ది రోజులకే యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్, పేసర్ దీపక్ చాహర్ కొవిడ్ బారిన పడ్డారు. వారే కాకుండా సోషల్ మీడియా సిబ్బందిలో పది మందికి పైగా పాజిటివ్ వచ్చింది. దీంతో ధోనీసేనకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించలేదు. సురేశ్ రైనా కూడా లేకపోవడం వల్ల వరుస ఓటములతో ఆ జట్టు నిరాశపరిచింది.
ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్ ముంబయిలో బస చేస్తోంది. పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్.. అక్కడే శిబిరాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇవన్నీ వాంఖడేలోనే మ్యాచులు ఆడనున్నాయి. కానీ మహారాష్ట్రలో కొవిడ్-19 బీభత్సం సృష్టిస్తోంది. రోజుకు 40వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్, ఇండోర్‌ను స్టాండ్‌బై వేదికలుగా గుర్తించినా ఇప్పటికిప్పుడు తరలించే అవకాశం లేదని తెలుస్తోంది.
'సీఎస్‌కే కంటెంట్ బృందంలోని ఒకరికి కరోనా సోకింది. వెంటనే అతడిని ఏకాంతంలోకి పంపించారు. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది వద్దకు వెళ్లలేదని అతడు ధ్రువీకరించాడు. అంటే క్రికెటర్లంతా సురక్షితంగా ఉన్నట్టే. వారు సాధన కొనసాగిస్తున్నారు. కొవిడ్-19 నిబంధనలు, ఆంక్షల్ని కఠినంగా పాటిస్తున్నాం. అయినప్పటికీ ఒకరికి కొవిడ్ రావడం దురదృష్టకరం' అని ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి.