రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్(csk vs rcb) జట్ల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ టాస్ వేసేందుకు షార్జా మైదానంలోకి వచ్చారు. అదే సమయంలో ఒక్కసారిగా ఇసుక తుపాను చెలరేగడం వల్ల అంపైర్లు టాస్‌ను కొంతసేపు ఆలస్యం చేశారు. దీంతో కోహ్లీ, ధోనీ.. సరదా కబుర్లు చెప్పుకొనేందుకు మంచి సమయం దొరికింది.
ఈ క్రమంలోనే ఇద్దరు కెప్టెన్లు ముచ్చటించుకుంటున్న వీడియోను ఐపీఎల్ నిర్వహకులు ట్విటర్‌లో పోస్టు చేశారు. అది చూసిన టీమ్‌ఇండియా అభిమానులు సంతోషంతో లైకులు, కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరినీ ఇలా చూడటం బాగుందని అంటున్నారు. అలాగే చాలా రోజుల తర్వాత కలిశారు కదా.. ఏం మాట్లాడుకుంటున్నారో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, రాబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా గురించి చర్చించి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. వచ్చేనెల యూఏఈలోనే జరిగే టీ20 ప్రపంచకప్‌లో ధోనీ టీమ్‌ఇండియా మెంటార్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఐపీఎల్‌లో వీరిద్దరూ టాస్‌కు రావడం ఇదే ఆఖరిసారి అయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ధోని ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌లో కొనసాగేది అనుమానంగా కనిపిస్తోంది. కోహ్లీ కూడా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగా ఇదే చివరి సీజన్ అని స్పష్టం చేశాడు. అలాగే చెన్నై, బెంగళూరు జట్లు ఇప్పటికే ఈ సీజన్‌లో రెండుసార్లు తలపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరు జట్లూ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే తప్ప కోహ్లీ, ధోనీలను ఇలా చూసే అవకాశం లేనట్లే!
ఇది చదవండి: Dhoni vs Kohli: ధోనీ-కోహ్లీ.. ఇదే చివరిసారి!