Akash Madhwal IPL : లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి పేసర్ ఆకాశ్ మధ్వాల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముంబయికి కీలకమైన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పలువురు క్రీడా విశ్లేకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. మరోవైపు ముంబయి జట్టు యాజమాన్యం కూడా తమకు ఆకాశ్ మధ్వాల్ రూపంలో అద్భుతమైన బౌలర్ దొరికాడంటూ తెగ సంబరపడుతోంది. ఈ సమయంలో మధ్వాల్ సోదరుడు ఆశిష్.. అతడి క్రికెట్ నేపథ్యం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. అప్పట్లో వారి స్వగ్రామంలో ఆకాశ్‌ను లోకల్ లీగ్ క్రికెట్ టోర్నీలు ఆడకుండా బ్యాన్ విధించారని తెలిపాడు. దానికి కారణం బ్యాటింగ్ చేసేవారందరికీ ఆకాశ్ చాలా ప్రమాదకరంగా మారడమేనని వివరించాడు.
'ఆకాశ్ మధ్వాల్ గొప్పగా ప్రదర్శన చేయడానికి కారణం ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. అతడి ప్రోత్సాహం వల్లే ఆకాశ్ అంత అద్భుతంగా ఆడగలుగుతున్నాడు. రోహిత్ తన జట్టు ఆటగాళ్లపై ఎంతో నమ్మకం ఉంచి వీలైనన్ని అవకాశాలు ఇస్తాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఏ ఆటగాడు అయినా.. తమ స్థానం గురించి ఆందోళన చెందుతారు. అయితే.. రోహిత్ ఆ భయాలను తొలగించి కొత్త ప్లేయర్లకు అండగా నిలుస్తాడు. అలాగే రోహిత్, ఆకాశ్‌కు మద్దతుగా ఉన్నందునే అతడు ఈరోజు అద్భుతంగా ఆడుతున్నాడు. ఆకాశ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్న సమయంలో.. అతడి స్నేహితులు మ్యాచ్ ఉన్న రోజు మా ఇంటికి వచ్చి ఉద్యోగానికి వెళ్లొద్దు అనేవారు. కావాలంటే డబ్బులు కూడా ఇస్తామనేవారు. అప్పుడు కూడా ఆకాశ్ అద్భుతంగా బౌలింగ్ చేసేవాడు. అతడి బంతులను ఎదుర్కోవడానికి బ్యాటర్లు భయపడేవారు. అందుకే లోకల్ టోర్నమెంట్ల నుంచి అకాశ్‌ను నిషేధించారు. ఆ తర్వాత అతడు రూర్కీ బయటకు వెళ్లి ఆడేవాడు. లఖ్‌నవూతో మ్యాచ్ తర్వాక ఆకాశ్‌కు వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇక అతడు టెన్నిస్ బాల్‌తో ఆడే రోజులు పోయాయి. ప్రస్తుతం ఆకాశ్ సంతోషంగా ఉన్నాడు. మ్యాచ్‌లో ఆకాశ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడి సగం టెన్షన్ రోహిత్ శర్మ తీసుకుంటాడు. వారి మధ్య అంత మంచి బంధం ఏర్పడినందుకు సంతోషిస్తున్నా'
- ఆకాశ్ మధ్వాల్ సోదరుడు ఆశిష్
Akash Madhwal IPL Stats : బుధవారం చెన్నై చిన్నస్వామి వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లఖ్‌నవూ పై ముంబయి 81 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్ 'ఆకాశ్ మధ్వాల్' ఐదు వికెట్లు తీసి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు.