ఐపీఎల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో విదేశీ బ్యాట్స్‌మన్‌గా ఏబీ డివిలియర్స్ నిలిచాడు. మంగళవారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఏబీ ఇప్పటివరకు 161 ఇన్నింగ్స్‌ల్లో 5053 పరుగులు చేశాడు. అత్యంత తక్కువ బంతుల్లో (3288) 5 వేల పరుగులు చేసిన ఆటగాడు డివిలియర్సే. వార్నర్ (3554) రెండో స్థానంలో ఉన్నాడు.
తొలి మూడు సీజన్లలో దిల్లీకి ప్రాతినిధ్యం వహించిన డివిలియర్స్.. 2011 నుంచి బెంగళూరుకు ఆడుతున్నాడు. ఐపీఎల్ 5 వేల పరుగులు చేసిన తొలి విదేశీ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్. అతడు ఇప్పటివరకు 5390 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో విరాట్ కోహ్లి (6041) అగ్రస్థానంలో ఉన్నాడు.