క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఇష్టపడే ఐపీఎల్ 16వ సీజన్.. అరుదైన రికార్డును నమోదు చేసింది. లీగ్ ప్రారంభమైన తొలి మూడు రోజుల్లోనే అక్షరాల 147 కోట్ల వీడియో వ్యూస్‌ను సంపాదించింది. ఈ 16వ సీజన్ ప్రసార హక్కులను డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియో దక్కించుకుంది. జియో సినిమాలో ఫ్రీగా ఈ మెగా లీగ్ చూసే అవకాశం రావడంతో అభిమానులు ఎగబడి మరీ చూశారు. ఇలా ఒకేసారి ఇన్ని కోట్లలో వ్యూస్ రావడం ఒక విశేషం అయితే.. ఒక్కో మ్యాచ్‌ను ఒక వ్యక్తి సగటున 57 నిమిషాలు పాటు చూడటం కూడా మరో రికార్డు. 147 కోట్ల వ్యూస్ అనేది గత సీజన్ మొత్తం కలిపి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై వచ్చిన వ్యూస్ కంటే కూడా ఎక్కువే.
ఐపీఎల్ 15వ సీజన్ తొలి వారాంతంతో పోలిస్తే ఈసారి జియో సినిమా యాప్‌లో ప్రతి మ్యాచ్‌పై ఒక వ్యూయర్ గడిపిన సమయం 60 శాతానికి పెరిగింది. కాగా, ఈ సీజన్ తొలి వీకెండ్లో ఐదు మ్యాచ్‌లు జరిగాయి. ఈ ఐదు మ్యాచ్‌లకు కలిపి వచ్చిన వీడియో వ్యూస్ 147 కోట్లు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఈ వ్యూవర్షిప్ సరికొత్త రికార్డును నెలకొల్పింది.
వేల కోట్లు వెచ్చించి.. ఫ్రీగా..
వేల కోట్లు వెచ్చించి ఐదేళ్ల పాటు డిజిటల్ ప్రసార హక్కులను దక్కించుకుంది రిలయన్స్ కంపెనీ. కానీ, ఐపీఎల్ మ్యాచ్‌లను మాత్రం జియో సినిమాలో ఉచితంగా చూసే వీలును కల్పించింది సంస్థ. ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకపోవడంతో జనాలు కూడా యథేచ్ఛగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తున్నారు. మరోవైపు లీగ్ ప్రారంభమైన తొలి మూడు రోజుల్లోనే 5 కోట్ల జియో సినిమా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు క్రికెట్ లవర్స్.
మార్చి 31న ఐపీఎల్ ప్రారంభమైన తొలి రోజే ఏకంగా 2.5 కోట్ల మంది జియో సినిమా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని సంస్థ తెలిపింది. దీంతో ఒక రోజులోనే అత్యధిక డౌన్‌లోడ్స్ అయిన యాప్‌గా జియో సినిమా రికార్డు సృష్టించింది. ప్రత్యేకించి ఐపీఎల్ కోసం జియో సినిమా యాప్‌లో అనేక ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు నిర్వాహకులు. ఐపీఎల్ ముగిసే వరకూ ప్రతి వారం ఓ నయా ఫీచర్‌ను యాడ్ చేసే యోచనలో ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
అయితే ఈ ప్రీమియర్ లీగ్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ప్రతి లీగ్‌కు దీన్ని వీక్షించే వాళ్లు కూడా క్రమంగా పెరుగుతున్నారు. ఇన్ని కోట్ల వ్యూస్ రావడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి క్రికెట్ అంటే ఎంతో ఇష్టంతో చూసే వాళ్ల ద్వారా ఎక్కువ వ్యూస్ వస్తుండగా.. ఇంకొందరు వీటిపై బెట్టింగ్ కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తున్నారన్నది వాస్తవం.
12 భాషల్లో లైవ్..
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడ, పంజాబీ, ఒరియా, బంగాలీ, భోజ్‌పురి, గుజరాతీ, మరాఠీ సహా మొత్తం 12 భాషల్లో జియో సినిమా అభిమానులకు ఐపీఎల్ లైవ్ అందిస్తోంది.