Rashid Khan IPL Retention: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అడుగు పెట్టినప్పటి నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తరఫున ఆడుతున్న అఫ్గానిస్థాన్ లెగ్‌స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను.. ఈసారి ఫ్రాంఛైజీ వదిలేసుకుంది. ఈ విషయంపై అతడు స్పందిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన అభిమానులకు, తనపై నమ్మకం ఉంచిన జట్టు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపాడు.
"సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నా ప్రయాణం అద్భుతంగా సాగింది. ఇన్నాళ్లు నాపై నమ్మకంతో ప్రోత్సహించిన జట్టు యాజమాన్యానికి ధన్యవాదాలు. మా జట్టుకు అండగా నిలిచిన ఆరెంజ్ ఆర్మీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని రషీద్‌ఖాన్ ట్వీట్ చేశాడు.
హైదరాబాద్ తరఫున 76 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రషీద్ ఖాన్.. 6.33 ఎకానమీతో 93 వికెట్లు పడగొట్టాడు. ఎనిమిది సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
Sunrisers Hyderabad Retained Players: కెప్టెన్ విలియమ్సన్‌తో పాటు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం అట్టిపెట్టుకుంది. మిగతా చాలా మంది కీలక ఆటగాళ్లను వదులుకునేందుకు ఆసక్తి చూపింది. రానున్న సీజన్ కోసం జట్టు కూర్పులో సమూలమార్పులు చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలిపిన డేవిడ్ వార్నర్‌ను కూడా దూరం చేసుకుంది. సన్‌రైజర్స్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన జానీ బెయిర్‌స్టోను కూడా వదులుకుంది.