IPL Nicholas Pooran: ఐపీఎల్ మెగా వేలం కొందరికి కామధేనువుగా మారింది. గత సీజన్‌లో పెద్దగా రాణించకపోయినా ఈసారి భారీ మొత్తాలనే దక్కించుకున్నారు. అటువంటి ఆటగాళ్లలో విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ ఒకడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.10.75 కోట్లను వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. బ్యాటర్ అయిన పూరన్ మిడిలార్డర్‌లో అక్కరకొస్తాడని ఎస్‌ఆర్‌హెచ్ భావించినట్లు ఉంది. ప్రస్తుతం భారత్‌లోనే విండీస్ జట్టు పర్యటిస్తోంది. ఈ క్రమంలో టీ20 సిరీస్ కోసం కోల్‌కతాలోని బయోబబుల్‌లో టీమ్ ఉంది.
ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధరను దక్కించుకున్న పూరన్ మరుసటి రోజు తన సహచరులకు చిన్న పార్టీ ఇచ్చాడు. అయితే ఇదేదో బయటకెళ్లి కాదులేండి.. విండీస్ జట్టు బస చేస్తున్న హోటల్‌లోనే ఓ పదిహేను పిజ్జాలను తెప్పించాడు. వీటి ధర రూ. 15 వేలు. " బయోబబుల్ నియమాల ప్రకారం బయట నుంచి ఆహారం తెప్పించేందుకు అవకాశం లేదు. దీంతో హోటల్‌లోని చెఫ్‌తో 15 పిజ్జాలను తయారు చేయించి అందించాం. క్వాలిఫైడ్ చెఫ్‌తోనే పిజ్జాలను రుచికరంగా తయారు చేయించాం. మొత్తం పదిహేను పిజ్జా బాక్సులను శానిటైజ్ చేసి మరీ క్రికెటర్ల రూమ్‌కే పంపించాం. అక్కడి నుంచే పూరన్ పేమెంట్ కూడా చేసేశారు" అని హోటల్ స్థానిక మేనేజర్ తెలిపారు.
అయితే పిజ్జా ట్రీట్ ఇచ్చిన తర్వాతి రోజు పూరన్ కొద్దిపాటి షాక్‌కు గురయ్యాడు. ఫోన్ ఛార్జర్‌తో సమస్య ఉండటం వల్ల స్పేర్ ఛార్జర్ కావాలని హోటల్ సిబ్బందిని పూరన్ కోరాడు. సిబ్బంది ఇచ్చిన ఛార్జర్‌ను ప్లగ్‌లో పెడుతుండగా కొద్దిగా షాక్ తగిలింది. శానిటైజేషన్ చేసిన ఛార్జర్ కావడం వల్ల ఇలా జరిగిందని టీమ్ మేనేజర్ వివరణ ఇచ్చారు. ఎలాంటి గాయం కాలేదని, ప్రమాదమేమీ లేదని వెల్లడించారు.
ఇదీ చదవండి: ఐపీఎల్ వేలంలో అందుకే మా ఇద్దరిని కొనలేదు: రిచర్డ్సన్