IPL Suresh raina Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ సురేశ్ రైనా.. ఆ జట్టు సారథి ధోనీ విశ్వాసాన్ని కోల్పోయాడని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రైనాను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. దీంతో అతడి కెరీర్ పూర్తిగా ముగిసినట్లేనని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రైనాను ఎవరూ ఎంపిక చేసుకోకపోవడంపై స్పందించిన సైమన్.. అందుకు పలు కారణాలున్నాయని చెప్పాడు. అందుకే చెన్నైతో సహా ఇతర ఫ్రాంఛైజీలు రైనాపై ఆసక్తి చూపలేదని అన్నాడు.
"వేలంలో రైనాను ఎవరూ కొనుగోలు చేయకపోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. యూఏఈలో అతడు చెన్నై జట్టు విశ్వాసాన్ని కోల్పోయాడు. ఆ విషయంలో అసలేం జరిగిందనేది మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇప్పటికే జరగాల్సినదంతా జరిగిపోయింది. రైనా జట్టుతో పాటు.. కెప్టెన్ ధోనీ నమ్మకాన్నీ కోల్పోయాడు. ఎవరి విషయంలోనైనా ఒక్కసారి అలా జరిగితే.. ఇక తిరిగి జట్టులోకి రావడం అసాధ్యం"
-సైమన్.
సురేశ్ రైనా ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచీ చెన్నై జట్టులోనే ఉన్నాడు. 2016, 17 సీజన్లలో ఆ జట్టు నిషేధానికి గురైనప్పుడు మాత్రం గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు. అయితే, 2020లో వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కు దూరమైన రైనా.. గతేడాది తిరిగి జట్టులో చేరి ఆడినా పెద్దగా స్కోర్లు చేయలేకపోయాడు. మరోవైపు రైనా అంతర్జాతీయ క్రికెట్‌కూ వీడ్కోలు పలకడం వల్ల సరైన ఫిట్‌నెస్ లేడనే కారణంతో సీఎస్కే ఈ సారి వదిలేసిందని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ఇటీవల వెల్లడించాడు.
ఇదీ చూడండి: Dhoni Captaincy: నాలుగు తరాల నాయకుడు ధోని..