మరో రెండు రోజుల్లో ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ మొదలై సుమారు పదిహేనేళ్లయింది. ఆ 15 ఏళ్లలో ఎన్నో రసవత్తర మ్యాచ్‌లు..ఎన్నో గుర్తుండిపోయే అద్భుత ప్రదర్శనలు. ఇన్నేళ్లలో ప్రతి ఫ్రాంఛైజీ తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకుంది. అదే ఐడెంటిటీతో అభిమానులను అలరిస్తోంది. చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ గురించి అయితే ఇంక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ముంబయి అయిదు సార్లు టైటిల్ గెలిస్తే, చెన్నై కూడా దానికి ధీటుగా నాలుగుసార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది.
అయితే లీగ్ మొదలై దశాబ్ద కాలానికి పైగా గడిచినా ఇప్పటివరకు దిల్లీ, పంజాబ్, బెంగళూరు, ఒక్కటంటే ఒక్కసారీ కూడా ట్రోఫీని గెలుచుకోకపోవడం గమనార్హం. ఈ టీమ్‌లన్నీ తమని తాము ఎన్నో సార్లు మార్చుకున్నప్పటికీ వారికి నిరాశ తప్పట్లేదు. ఇక 2023 ఐపీఎల్‌లో పోటీపడుతున్న టీమ్స్‌లో ఈ మూడు కాకుండా కప్పు గెలవని టీమ్ మరొకటి ఉంది. అదే కొత్త జట్టు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్. అయితే ఈ సీజన్‌కు కొత్త ఛాంపియన్ వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే మరి.
స్టార్స్ ఉన్నప్పటికీ..
మరోవైపు ఐపీఎల్‌లో అత్యంత ఆకర్షణీయంగా కనిపించే జట్లలో ఆర్సీబీ ఒకటి. ఈ జట్టుకు అభిమానులు కూడా ఎక్కువే. అయితే కోహ్లీ, గేల్, డివిలియర్స్.. ఇలా ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆర్సీబీకి ఒక్క సారి కూడా కప్పు దక్కలేదు. ఇక స్థాయికి తగ్గ ప్రదర్శన చేయని జట్టు ఏదైనా ఉంది అంటే అది బెంగళూరే. ఇలా ఉందని అది పూర్తిగా విఫలమైందని కాదు. కప్పు అందుకునేందుకు దగ్గరికి వెళ్లినప్పటికీ ఆ జట్టు కల మాత్రం ఇప్పటివరకు నెరవేరలేదు. 2009, 2011, 2016 ఇలా వరుసగా మూడుసార్లు ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన ఆర్సీబీ.. 2010, 2015, 2020, 2021, 2022.. మొత్తం ఎనిమిదిసార్లు ప్లేఆఫ్స్‌లోకి ఎంటరయ్యింది.
ప్రతి ఏడాదీ 'ఈ సారి కప్పు మనదే' అని అభిమానులు అనుకోవడం.. మరోవైపు బెంగళూరు నిరాశపరచడం సర్వసాధారణమైపోయింది. టోర్నీలో అత్యధిక స్కోరుతో (263) పాటు అత్యల్ప స్కోరు (49) రికార్డులన్నీ ఆర్సీబీ పేరిట ఉన్నాయంటే ఇక ఆ జట్టు నిలకడలేమి ఎలా ఉందో ఇట్టే స్పష్టమైపోయింది. జట్టు ఎంపికే ఆర్సీబీకి ప్రధాన సమస్య. మేటి ఆటగాళ్లున్నప్పటికీ సమతూకం లేకపోవడం వల్ల ఆ జట్టు దెబ్బతిన్నది. అసలు ఆక్షన్‌లోనే అవసరాలకు తగ్గట్లు ఆటగాళ్లను ఎంపిక చేసుకులేకపోతోందని బెంగళూరుపై పెద్ద విమర్శ కూడా ఉంది. ఇక లోయర్ ఆర్డర్ బ్యాటింగ్, పేస్ బౌలింగ్ ఆ జట్టుకు అంతగా కలిసి రాలేదు.
మరోవైపు తుది జట్టులో పదే పదే మార్పులు చేయడం కూడా ఆర్సీబీ దెబ్బతినడానికి కారణమని చెప్పొచ్చు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడాఆర్సీబీ భారీ అంచనాలతోనే బరిలోకి దిగనుంది. గత మూడు టోర్నీల్లో ప్లేఆఫ్స్‌కు చేరడం ఆ జట్టు విశ్వాసాన్ని మరింత పెంచింది. కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి వైదొలగడం వల్ల అతని స్థానంలో వచ్చిన డుప్లెసిస్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా అతను జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. ఇక కోహ్లీ,మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, హర్షల్ పటేల్, హసరంగలతో బలంగా ఉన్న బెంగళూరు ఈసారి ప్రత్యర్థులకు గట్టీ పోటీ ఇవ్వనుంది.
జోరందుకునేది ఎప్పుడో..
ఐపీఎల్‌లోని మరో టీమ్ అయిన పంజాబ్ కింగ్స్ కూడా తమ పేలవ ప్రదర్శనతో మైదానంలో నిలదొక్కుకోలేకపోతోంది. ఇప్పటి వరకు ఏ దశలోనూ ఆ జట్టు ఐపీఎల్ టాప్ టీమ్స్ లిస్ట్‌లో పేరు సంపాదించుకోలేకపోయింది. 2014లో ఫైనల్, 2008లో సెమీఫైనల్ తప్ప వారి దగ్గ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనపడదు. పంజాబ్ ముందున్న అతి పెద్ద సమస్య ఒక జట్టుగా లేకపోవడమే. ముంబయి, చెన్నై జట్లలా పంజాబ్‌కు ఎప్పుడూ ఒక ప్రధాన జట్టుగా కనపడలేదు. సరైన ప్రణాళికలు కూడా వారి దగ్గర లేవు. దీంతో పాటు ప్రతి ఏడాది ఆటగాళ్లతో పాటు పదే పదే కెప్టెన్లను మార్చడం వల్ల ఓ సమష్టి జట్టుగా పంజాబ్ ఎప్పుడూ స్థిరంగా ఉండలేకపోయింది. ఇక కోచ్‌లనూ మార్చడం కూడా పంజాబ్‌కు పరిపాటిగా మారింది. తుది జట్టులో కూడా ఎప్పుడూ మార్పులు చేయడం వల్ల కూడా పంజాబ్ టీమ్‌ను దెబ్బతీస్తోంది.
మరోవైపు అత్యథిక ధరలకు ఆటగాళ్లను కొనడం, వాళ్లను కూడా ఎక్కువ కాలం టీమ్‌లో ఉంచక పోవడం వల్ల పంజాబ్‌కు ఓ సరైన రూపు అంటూ లేకుండా పోతోంది. 13 సార్లు లీగ్ దశ దాటలేకపోయిన పంజాబ్ ఎప్పుడూ చివరి స్థానాల కోసం పోటీ పడుతూనే వచ్చింది. 2015 నుంచి ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్‌కు చేరువవ్వని ఆ జట్టు.. ఈసారైనా ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెడుతుందేమో అనే ఆశతో మరోసారి కెప్టెన్‌ను మార్చింది. అలా టీమ్ఇండియా ప్లేయర్ శిఖర్ ధావన్‌కు బాధ్యతలు అప్పగించింది. అయితే 2023లో పంజాబ్‌పైన ఎటువంటి అంచనాలైతే లేవు. జట్టు సభ్యులు సామ్ కరన్‌తో పాటు రబాడ, కెప్టెన్ ధావన్ ఏమేరకు జట్టును గెలిపించేందుకు కృషి చేస్తారో వేచి చూడాల్సిందే. ఇక స్టార్ బ్యాటర్ బెయిర్‌స్టో దూరం కావడం వల్ల ఈ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.
దిల్లీ ఈ సారైనా..
ఒకప్పటి డేర్ డెవిల్స్ అయిన దిల్లీ క్యాపిటల్స్ తన ఐపీఎల్ ప్రస్థానాన్ని గ్రాండ్‌గానే ప్రారంభించింది. తొలి రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌తో దూసుకెళ్లగా.. రెండో సీజన్లోనైతే టేబుల్ టాపర్‌గా నిలిచింది. కానీ ఆ తర్వాత నుంచి మంచి ఆటగాళ్లున్నప్పటికీ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైంది. 2010 నుంచి 2018 వరకు ఒక్కసారి (2012) తప్ప మరెప్పుడూ లీగ్ దశను దాటలేకపోయింది. ఈ జట్టును అస్థిరత వెంటాడుతూనే ఉంటుంది. సెహ్వాగ్, శిఖర్ ధావన్ లాంటి ఆటగాళ్లు సైతం ఈ జట్టును టాప్‌లోకి తీసుకెళ్లలేకపోయారు. వేలంలో సరైన ఆటగాళ్లను తీసుకోకపోవడంతో పాటు సమతూకం లోపించడం వల్ల దిల్లీ మరి కాస్త దెబ్బతింది. అయినప్పటికీ దిల్లీ ఇప్పుడు బలంగానే ఉంది.
ఇక యువ ఆటగాళ్ల చేరికతో పాటు కోచ్‌గా పాంటింగ్‌ను నియమించాక గత కొన్నేళ్లలో ఈ టీమ్ మరింత వేగం పుంజుకుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 2020లో చక్కని ప్రదర్శనతో ఫైనల్‌కు వరకు చేరుకోగలిగింది. అయితే పంత్ నేతృత్వంలో ప్లేఆఫ్ దశకు చేరలేకపోయినప్పటికీ.. ఈసారి మంచి అంచనాలతోనే బరిలోకి దిగుతోంది. అయితే ప్రమాదంలో గాయపడ్డ కెప్టెన్ పంత్ దూరం కావడం ఆ జట్టుకు నిజంగా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. కానీ పృథ్వీ షా, వార్నర్, నోకియా, మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్ లాంటి సభ్యులతో ఈ టీమ్ బలంగానే కనిపిస్తోంది. ఇక ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు డేవిడ్ వార్నర్ నాయకత్వం వహించనున్నాడు.