IPL 2023 Sunrisers Williamson: ఓటమి బాధలో ఉన్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్ కోసం అతడ్ని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని హైదరాబాద్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. కేన్ విలియమ్సన్‌ను వదులు కోవడమే ఉత్తమమని ఆ జట్టు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలాన్ని డిసెంబర్ 23 కేరళలోని కొచ్చి వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే నవంబర్ 15 లోపు ఫ్రాంచైజీలన్నీ తమ రిటెన్షన్ లిస్ట్ అందజేయాలని ఆదేశించింది.
టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్ ముగిసిన రెండు రోజులకే ధనాధన్ లీగ్ సంబంధించిన కీలక అప్‌డేట్ రానుంది. ఇప్పటికే ఆయా జట్లు తమ రిటెన్షన్ జాబితాను సిద్దం చేసుకున్నాయి. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. జట్టు వైఫల్యానికి గల కారణాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్దమైంది.
సుదీర్ఘకాలం జట్టును విజయ పథంలో నడిపిన డేవిడ్ వార్నర్‌ను కాదని కేన్ విలియమ్సన్‌పై నమ్మకం ఉంచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తీరని నష్టం జరిగింది. మేనేజ్‌మెంట్ నిర్ణయాలను విభేదించాడని వార్నర్‌ను పక్కనపెట్టేసిన సన్‌రైజర్స్.. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని మాత్రం తీసుకోలేకపోయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ వైఫల్యం జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపింది. 13 మ్యాచ్‌ల్లో 19.63 సగటుతో 216 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్ వైఫల్యంతో తీవ్ర ఒత్తిడికి గురైన కేన్ మామ.. కెప్టెన్సీలో కూడా తడబడ్డాడు. ఒకటి, రెండు మ్యాచుల్లో కేన్ చెత్త కెప్టెన్సీ కారణంగానే సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే కేన్ మామకు ఉద్వాసన పలకాలని సన్‌రైజర్స్ భావిస్తోంది.
అంతర్జాతీయ టీ20ల్లోనూ కేన్ విలియమ్సన్ ప్రదర్శన దారుణంగా ఉంది. తాజాగా జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌లోనూ కేన్ మామ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. అంతేకాకుండా ఈ ఫార్మాట్‌కు తగ్గట్లు వేగంగా ఆడలేకపోతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ కారణంగానే న్యూజిలాండ్ ఓటమిపాలైంది.
తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ ధాటిగా ఆడలేకపోయిన కేన్ మామ.. కీలక సమయంలో ఔటై జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ కేన్ విలియమ్సన్‌ను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేన్ విలియమ్సన్‌తో పాటు రొమారియో షెఫర్డ్, జగదీశ సుచిత్, కార్తీక్ త్యాగి, సీన్ అబాట్, శశాంక్ సింగ్, ఫజహక్ ఫారూఖీ, శ్రేయాస్ గోపాల్‌లను వదిలేయనున్నట్లు సమాచారం.