IPL 2022 Shubman Gill: జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న సమయంలో కొత్త షాట్లు నేర్చుకున్నానని, ఆ షాట్లను రాబోయే ఐపీఎల్‌లో చూస్తారని భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెప్పాడు. "జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న సమయంలో బ్యాటింగ్‌లో లోపాలను దిద్దుకునే అవకాశం దొరికింది. అంతే కాదు ఒకట్రెండు కొత్త షాట్లను నేర్చుకున్నా. ముఖ్యంగా కోచ్‌ల పర్యవేక్షణలో టెక్నిక్‌ను మెరుగుపరుచుకున్నా. ఒక ఆటగాడిగా ఎలాంటి షాట్లనైనా ఆడగలిగి ఉండాలి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో ప్రయోగాత్మక షాట్లు కొట్టాలి. క్రికెట్ పుస్తకంలో ఉన్న అన్ని షాట్లు ఆడగలుగుతాను. కానీ కొన్ని పిచ్‌లపై మాత్రం భారీ షాట్లు కొట్టలేను. ఇప్పుడు మైదానం నలుమూలలా షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. రాబోయే ఐపీఎల్‌లో మీరు నా నుంచి అలాంటి భిన్నమైన షాట్లను చూడబోతున్నారు" అని శుభ్‌మన్ చెప్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున రాణించినట్లే కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ తరఫునా సత్తా చాటాలని ఆశిస్తున్నట్లు గిల్ పేర్కొన్నాడు. "రాబోయే సీజన్లో గుజరాత్ తరఫున రాణించాలని కోరుకుంటున్నా. ఒకవేళ మా జట్టును ప్లేఆఫ్స్ లేదా ఫైనల్ చేర్చగలిగితే నేను టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు మెరుగవుతాయి. స్ట్రైక్ రేట్ గురించి విమర్శలను పట్టించుకోవట్లేదు. ఎలాంటి స్థితిలో ఆడే అవకాశం వచ్చినా రాణించడం ముఖ్యం. ఒకవేళ 200 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయాల్సి వచ్చినా చేయగలగాలి. అయితే ఒత్తిడి సమయంలో కాస్త తగ్గి ఆడాలన్నా ఆడాలి. ఐపీఎల్‌లో 2018లో కోల్‌కతా తరఫున తొలి సీజన్ ఆడినప్పుడు 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేశా. ఆ తర్వాత ఏడాది ఏడో స్థానంలోనే ఆడా. కానీ నేను ఆడిన మూడో సీజన్లో మాత్రం ఓపెనింగ్ చేశా. టాప్ ఆర్డర్‌లో ఆడడం నాకిష్టం. కానీ జట్టు అవసరాలకు తగ్గట్లు సర్దుకుపోవాల్సి ఉంటుంది" అని శుభ్‌మన్ చెప్పాడు.
ఇదీ చదవండి: ఈ ఐపీఎల్‌లోనైనా పాత విరాట్‌ను చూస్తామా..?