IPL 2022 RCB Kohli partener: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభంకానుంది. ఈసారి రెండు కొత్త జట్లు ఎంట్రీతో మెగా వేలం నిర్వహించడం వల్ల అన్ని జట్లలోని ఆటగాళ్లు పూర్తిగా మారిపోయారు. దీంతో ప్రతి జట్టు ఈసారి కొత్త ఆలోచనలు, కొత్త కాంబినేషన్లను అనుసరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే ఆర్సీబీ కూడా ఈసారి టాప్ ఆర్డర్‌లో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. ఆ జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్ మాత్రమే ఉన్నారు. ఇక మిగతావారందర్నీ వేలంలోనే కొనుగోలు చేసింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆటగాడు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఫా డుప్లెసిస్. అతడిని ఈ ఫ్రాంఛైజీ రూ.7 కోట్ల అత్యధిక ధర వెచ్చించి మరీ కొనుగోలు చేయడం విశేషం. దీంతో టాప్‌ఆర్డర్‌లో అతడికి కోహ్లీకి తోడుగా బరిలోకి దింపాలని ఆ జట్టు భావిస్తోంది. అందుకు సంబంధించిన ఓ మార్ఫింగ్ ఫొటోను కూడా ఆర్సీబీ ట్విటర్‌లో పంచుకుంది.
"కోహ్లీ, డుప్లెసిస్ ఆర్సీబీ జెర్సీలో ఉన్నట్లు రూపొందించిన ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేసి ‘భవిష్యత్‌కు సంబంధించిన ఫొటో ఇది. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కలిసి బరిలోకి దిగితే చూడాలని ఆసక్తిగా ఉంది" అని వ్యాఖ్యానాలు జోడించింది. దీంతో వీరిద్దరూ కలిసి ఓపెనింగ్ చేసే వీలుందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు కోహ్లీ గతేడాది కెప్టెన్సీ పగ్గాలు వదిలేయడం వల్ల ఆ బాధ్యతలు ఎవరు చేపడతారా అనే ఆసక్తి మొదలైంది.
సారధి ఎవరో?..
మెగా వేలం పూర్తయి చాలా రోజులైనా ఇంకా ఆర్సీబీ కొత్త సారథి పేరు వెల్లడించలేదు. దీంతో ఈ విషయంపైనా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ బాధ్యతల్ని డుప్లెసిస్ లేదా మాక్స్‌వెల్‌కు అప్పగించాలని అంటున్నారు. అయితే, ఆర్సీబీ యాజమాన్యం ఎవరిని ఎంపి చేస్తుందో చూడాలి. ఇక డుప్లెసిస్ గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అతడు 14వ సీజన్‌లో రుతురాజ్ (635) తర్వాత అత్యధిక పరుగులు (633) చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే టాప్ ఆర్డర్‌లో డుప్లెసిస్ రాణిస్తాడని ఆర్సీబీ భావించి వేలంలో కొనుగోలు చేసింది.
ఇదీ చదవండి: కోహ్లీ వందో టెస్టు.. ఈ సారైనా సెంచరీ బాదుతాడా?