IPL 2022 Mumabai indians Rohith: ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబయి జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. గతరాత్రి టాప్-2లో కొనసాగుతున్న రాజస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ముంబయి సారథి రోహిత్ శర్మ తమ ఆటగాళ్ల ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశాడు. ఇదే తమ అసలైన సామర్థ్యం అని ఆనందపడ్డాడు. ఈ విజయాన్ని కచ్చితంగా తన పుట్టిన రోజు కానుకగా స్వీకరిస్తానని చెప్పాడు.
"ఇది మా అసలైన సామర్థ్యం. ఈ రోజు బయటకొచ్చింది. ఈ విజయాన్ని స్వీకరిస్తున్నాం. రాజస్థాన్‌ను ఆ మాత్రం స్కోరుకు కట్టడి చేయడం కష్టమని మాకు తెలుసు. అయితే, వాళ్లు మాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. వాళ్లకున్న బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటం వల్ల.. వికెట్లు పడగొడితే ఆ జట్టుకు కూడా కష్టమని మేం భావించాం. అందుకు తగ్గట్టే బౌలింగ్ చేయాలనుకున్నాం. దాన్ని ఈ మ్యాచ్‌లో కచ్చితంగా అమలుచేశాం. గత ఎనిమిది మ్యాచుల నుంచి బెస్ట్ కాంబినేషన్ కోసం రకారకాలుగా ట్రై చేశాం. కానీ అది పనిచేయలేదు. కానీ ఒక్క విషయం చెప్పగలను. మేం ఏ మ్యాచులోనూ చిత్తుగా ఓడిపోలేదు. గెలుపుకు చాలా దగ్గరగా వచ్చాం. " అని రోహిత్ పేర్కొన్నాడు.
అనంతరం తమ యువ బౌలర్లు షాకీన్, కార్తీకేయల గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ చాలా ధైర్యవంతులని పేర్కొన్నాడు. వాళ్లతో మాట్లాడినప్పుడు జట్టు కోసం ఏదో చేయాలనే తాపత్రయం వాళ్లలో కనిపించిందని వెల్లడించాడు. దీంతో వాళ్లకు బౌలింగ్ ఇవ్వడానికి తనకు నమ్మకం కలిగిందన్నాడు. "బట్లర్‌కు బౌలింగ్ చేయడానికి షాకీన్‌కు బంతి ఇవ్వడం నిజంగా సాహసోపేతమైన నిర్ణయం. అతడి బౌలింగ్‌లో బట్లర్ పలు సిక్సర్లు సాధించినా.. చివరికి తన బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. దీంతో రాజస్థాన్‌ను 10-15 పరుగుల తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగాం. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్‌లో మా ప్రదర్శన చాలా గొప్పగా ఉంది. బౌలర్లు సమష్టిగా రాణిస్తే బ్యాట్స్‌మన్ తమ పని పూర్తి చేశారు" అని హిట్‌మ్యాన్ అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 158/6 స్కోర్ సాధించగా.. ముంబయి 5 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ (51), తిలక్ వర్మ (35) రాణించారు.
ఇదీ చూడండి: IPL 2022: 'తీవ్ర నిరాశలో రోహిత్.. ఏమైందంటే?'