IPL 2022 Auction: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ది ప్రత్యేకమైన స్థానం. డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఆ జట్టు నిలకడైన ప్రదర్శన చేసింది. గతేడాది మాత్రం అన్ని విభాగాల్లో విఫలమై ఘోర పరాభవం ఎదుర్కొంది. అదే సమయంలో జట్టు యాజమాన్యం వార్నర్‌ను కెప్టెన్‌గా తొలగించింది. ఆ తర్వాత తుది జట్టు నుంచీ వీడ్కోలు పలికింది. దీంతో సన్‌రైజర్స్ ఓ గొప్ప ఓపెనర్‌ను కోల్పోయింది. మరోవైపు కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా ఉన్నా ఈ మెగా వేలంలో సరికొత్త ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సన్‌రైజర్స్ దగ్గర ఇంకా ఎంత సొమ్ము మిగిలి ఉంది? అందులో ఎవరెవరిని తీసుకుంటే బాగుంటుందో ఓ లుక్కేద్దాం..
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు..
సన్‌రైజర్స్ జట్టు ఈ ఐపీఎల్ మెగా టోర్నీకి ముగ్గురు క్రికెటర్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. అందులో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు ఒకరు కాగా, మిగతా ఇద్దరు భారత యువ పేసర్లు ఉన్నారు. కెప్టెన్‌కు రూ.14 కోట్లు కేటాయించిన సన్‌రైజర్స్.. మిగిలిన ఇద్దరు బౌలర్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌కు చెరో రూ4. కోట్లు వెచ్చించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ జట్టు వద్ద 22 స్లాట్లు ఖాళీ ఉన్నాయి. ఇంకా రూ.68 కోట్లు మిగిలి ఉన్నాయి. దీంతో సరైన కోర్ జట్టును సన్‌రైజర్స్ ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఓపెనర్లే కీలకం..
వార్నర్ సారథ్యంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ గతంలో బాగా రాణించిందంటే కారణం ఆ జట్టుకున్న ఓపెనర్లే ప్రధాన కారణం. అందులో ఒకరు వార్నర్ ఉండగా మరొకరు ఇంగ్లాండ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో ఉండేవాడు. కానీ ఈసారి ఆ జట్టు వారిద్దరినీ వదిలేయడంతో ఇప్పుడు మళ్లీ అంతటి గొప్ప ఓపెనర్లను తీసుకోవాలి. అయితే ప్రస్తుతం వేలంలో పాల్గొంటున్న క్రికెటర్లలో ఓపెనర్లుగా కనిపించే ఆటగాళ్ల జాబితా చూస్తే క్వింటన్ డికాక్, ఫా డుప్లెసిస్ ముందు వరుసలో ఉన్నారు. కొన్నేళ్లుగా ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రధాన ఓపెనర్‌గా ఉన్న డికాక్ ఆ జట్టుకు విలువైన పరుగులే అందించాడు. మరోవైపు డుప్లెసిస్ సైతం గతేడాది చెన్నై జట్టులో రాణించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో సన్‌రైజర్స్ కచ్చితంగా ఈ ఇద్దరిలో ఒకరిని తీసుకునే వీలుంది.
మిడిల్ ఆర్డర్ సమస్య తీర్చుకునేనా..?
సన్‌రైజర్స్ ఎప్పుడూ ప్రధానంగా ఎదుర్కొనే సమస్య మిడిల్‌ఆర్డర్ బ్యాటింగ్. నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఇదివరకు ఎంత మందిని ప్రయోగించి చూసినా సరైన ఫలితం రాబట్టలేకపోతోంది. దీంతో ఈ స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్ల కోసం ఇప్పుడు హైదారబాద్ యాజమాన్యం దృష్టి సారించే అవకాశం ఉంది. అయితే, ఆ స్థానాలను సరైన న్యాయం చేసే ఆటగాళ్లు వేలంలో కొద్ది మంది ఉన్నారు. వారిలో సురేశ్ రైనా, శ్రేయస్ అయ్యర్, అంబటి రాయుడు ప్రధానంగా కనిపిస్తున్నారు. రైనా ఐపీఎల్ టోర్నీలో అత్యంత కీలకమైన బ్యాట్స్‌మన్‌గా ఉన్నా.. ఈసారి తప్పనిసరి పరిస్థితుల్లో చెన్నై వదిలేసుకుంది. మరోవైపు రాయుడు కూడా చెన్నైలో కీలక ఆటగాడే. మిడిల్ ఆర్డర్‌లో దంచికొట్టగల సమర్థుడు. ఇక దిల్లీ వదిలేసుకున్న మేటి బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్. ఈ ముగ్గురూ విలియమ్సన్‌కు తోడైతే సన్‌రైజర్స్ మిడిల్ ఆర్డర్ సమస్య తీరినట్లే.
ఆల్‌రౌండర్ల మాటేంటి?
ఏ జట్టుకైనా పరిస్థితులను బట్టి రాణించే ఆల్‌రౌండర్ కావాలి. సన్‌రైజర్స్ కూడా అలాంటి ఆటగాళ్లపైనే ఇప్పుడు గురిపెట్టాలి. అయితే, ఎక్కువశాతం అన్ని జట్లూ పేస్ బౌలింగ్, బ్యాటింగ్ చేసే ఆటగాళ్లను కొనుగోలు చేయాలని చూస్తాయి. అలాంటప్పుడు సన్‌రైజర్స్ కూడా సరైన ఆల్‌రౌండర్లనే ఎంచుకోవాలి. అలాంటప్పుడు ఈ జాబితాలో కనిపించే మొదటి పేరు శార్దూల్ ఠాకూర్. మరోవైపు దీపక్ చాహర్ సైతం ఇటీవల బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. ఇక షకీబ్ అల్ హసన్, రాహుల్ త్రిపాఠి సైతం లోయర్ ఆర్డర్‌లో ఆదుకునే ఆటగాళ్లుగా ఉన్నారు. ఈ నలుగురిలో ఏ ఇద్దరిని తీసుకున్నా సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది.
బౌలింగూ ముఖ్యమే..
సన్‌రైజర్స్ జట్టులో ఇదివరకు భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ లాంటి ఇద్దరు స్పెషలిస్టులు ఉండేవారు. ఒకరు స్పిన్నర్‌గా సేవలందించగా మరొకరు పేసర్‌గా ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆ జట్టు ఇద్దరినీ వదిలేయడంతో కచ్చితంగా వారికి సమానమైన ఆటగాళ్లను తీసుకోవాల్సిన అవసరం ఉంది. రషీద్‌కు సరితూగే స్పిన్నర్ కావాలంటే ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్‌నే ఎంపిక చేసుకోవచ్చు. అలాగే భువీకి ఏమాత్రం తగ్గని పేస్ బౌలర్ కావాలంటే మహ్మద్ షమీ ఉన్నాడు. వీరికి తోడు యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్ లాంటి స్పిన్నర్లు.. ట్రెంట్ బౌల్ట్, ప్యాట్ కమిన్స్, రబాడా లాంటి విదేశీ పేసర్లు సైతం సన్‌రైజర్స్ బాగా పనికొచ్చే బౌలర్లుగా ఉన్నారు.
అయితే, ఐపీఎల్ వేలంలో ఎవరు ఎవర్ని ఏ లెక్కల ప్రకారం కొనుగోలు చేస్తారో కచ్చితంగా చెప్పలేం. కాబట్టి వీరిలో కనీసం సగం మందినైనా సన్‌రైజర్స్ తీసుకుంటే ఈసారి మెగా టోర్నీలో జట్టుకు పూర్వవైభవం తెచ్చుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: IPL Auction: గత సీజన్‌లో అదిరిపోయే ధర.. ఈసారి పరిస్థితి ఏంటి?