ఐపీఎల్లో మిగిలిపోయిన మ్యాచ్‌ల్లో తమ దేశ ఆటగాళ్లు ఆడకపోవచ్చని తెలిపారు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ యాష్లే గైల్స్. అంతర్జాతీయ క్రీడా క్యాలెండర్ దృష్ట్యా.. బోర్డుతో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న క్రికెటర్లు ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్.. లీగ్‌లో పాల్గొనబోరని వెల్లడించారు.
గత నెలలో ప్రారంభమైన ఐపీఎల్.. కొవిడ్ కారణంగా మే 4న నిరవధిక వాయిదా పడింది. టోర్నీ రద్దు కాలేదని.. మిగిలిపోయిన మ్యాచ్‌లకు వేదికను త్వరలోనే ప్రకటిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నొక్కి చెప్పారు.
“టీ20 ప్రపంచ కప్‌కు ముందు సన్నాహాక మ్యాచ్‌ల్లో భాగంగా త్వరలోనే బంగ్లాదేశ్, పాకిస్థాన్లతో సిరీస్‌లు ఆడనుంది ఇంగ్లాండ్. మా క్రికెటర్లు ఆ మ్యాచ్‌ల్లో పాల్గొంటారు. జూన్ 2న న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్ వేరు. సిరీస్ నిర్ణయమయ్యే నాటికే ఐపీఎల్లో ఆడటానికి ఆటగాళ్లు ఒప్పందం చేసుకున్నారు” అని బోర్డు డైరెక్టర్ తెలిపారు.
కివీస్‌తో సిరీస్‌కు కుర్రాళ్లకు అవకాశం..
“జూన్ 2 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో కొత్త ప్లేయర్లకు అవకాశం ఇవ్వనున్నాం. కివీస్‌తో సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయడానికి.. కోచ్ సిల్వర్‌వుడ్ ఆటగాళ్లతో కలిసి పనిచేయనున్నారు” అని గైల్స్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వారు దూరమయ్యారు'