ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ రెండో దశకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). యూఏఈ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో 14 బయో బబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. వీటిలోకి ప్రవేశించే ముందు ఆరు రోజుల పాటు ఆటగాళ్లందరూ క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది. దీంతో పాటు లీగ్ సజావుగా సాగడానికి ఆటగాళ్లతో పాటు ఆయా ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పాటించాల్సిన ఆరోగ్య సూచనలను వెల్లడించింది. ఇందుకు సంబంధించి 46 పేజీలతో కూడి సలహా(అడ్వైజరీ) బుక్‌ను విడుదల చేసింది.
"బయో సెక్యూర్ వాతవరణంలో మొత్తం 14 బయో బుడగలను ఏర్పాటు చేశాం. ఇందులో ఫ్రాంఛైజీ జట్లు, సపోర్ట్ స్టాఫ్‌కు 8 బయో బబుల్స్‌ను కేటాయించనున్నాం. మూడింటిని మ్యాచ్ అఫిషియల్స్, మేనేజ్మెంట్ టీమ్‌కు ఇవ్వనున్నాం. మిగిలిన వాటిలో బ్రాడ్కాస్ట్ కామెంటేటర్స్ ఉండటానికి ఏర్పాట్లు చేశాం" అని బీసీసీఐ తెలిపింది.
అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లు.. వారికి కేటాయించిన హోటల్ గదుల్లో ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. వారంతా ప్రాక్టీస్ సెషన్లకు హాజరయ్యే ముందు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. వీరంతా బీసీసీఐ కేటాయించిన బస్సులు, కార్లలో మాత్రమే ప్రయాణాలు చేయాలి. సంబంధిత డ్రైవర్లు కూడా బయో బుడగలో ఉంటారు. వారికి కూడా నిరంతరం కొవిడ్ పరీక్షలు చేస్తారు.
వారికి నేరుగా..
బబుల్ నుంచి మరో బబుల్‌లోకి వచ్చే ఆటగాళ్లకు నేరుగా అవకాశం కల్పించనుంది బీసీసీఐ. దీంతో కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వచ్చే ఆటగాళ్లు నేరుగా ఐపీఎల్ బుడగలో ప్రవేశిస్తారు. వీరితో పాటు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఆటగాళ్లు, శ్రీలంక-దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఉన్న ప్లేయర్లు సరాసరి బీసీసీఐ ఏర్పాటు చేసిన బుడగలో చేరనున్నారు.
కొవిడ్ వల్ల వాయిదా పడిన ఐపీఎల్ రెండో దశ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుందని బీసీసీఐ వెల్లడించింది.
ఇదీ చదవండి: Eng vs Ind: భారత్ 278 ఆలౌట్.. అండర్సన్ రికార్డు