ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ ఇరు జట్లతో దాగుడుమూతలు ఆడింది. హోరాహోరిగా సాగిన మ్యాచ్‌లో ఫలితాన్ని తేల్చేందుకు రెండు సూపర్ ఓవర్లు నిర్వహించాల్సి వచ్చింది. తొలి సూపర్ ఓవర్‌లో స్కోర్లు సమం కావడం వల్ల మరో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఆ ఓవర్‌లో పంజాబ్ తరఫున గేల్, మయాంక్ బ్యాటింగ్‌కు దిగారు. అయితే.. బ్యాటింగ్‌కు దిగే ముందు.. గేల్ కోపం, అసంతృప్తితో కనిపించాడు. మ్యాచ్ అనంతరం ఆ సమయంలో కోపంగా ఉండటానికి గల కారణాన్ని గేల్ వెల్లడించాడు.
"సూపర్ ఓవర్‌లో నేను బ్యాటింగ్‌కు వెళ్లే సమయంలో ఎలాంటి ఒత్తిడి లేదు(నవ్వుతూ). కాకపోతే కొంచెం కోపం వచ్చింది. సులభంగా గెలవాల్సిన మా జట్టును ఆ పరిస్థితిలో చూసి ఆందోళన చెందా. కానీ.. ఇది క్రికెట్. ఈ ఆటలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. తొలి సూపర్ ఓవర్‌లో ఆరు పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం కష్టమైన పని. పైగా క్రీజులో ఉన్నది రోహిత్, డికాక్. షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో నా హీరో షమీ. అతనికే నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. నేను నెట్స్‌లో షమీని ఎదుర్కొన్నా. అతను అద్భుత యార్కర్లు వేస్తాడు. మ్యాచ్‌లోనూ అదే పునరావృతం చేశాడు. మొత్తానికి మా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు."
-గేల్, పంజాబ్ బ్యాట్స్‌మన్
రెండో సూపర్ ఓవర్లో 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు యూనివర్స్ బాస్ తొలి బంతికే సిక్సర్ అందించాడు. తర్వాత బంతికి సింగిల్ తీశాడు. మయాంక్ వరుసగా రెండు ఫోర్లు బాది జట్టును గెలిపించాడు.