రాజస్థాన్‌పై ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. జట్టులో మెరుగైన ఆటగాళ్లు ఉండటమే ఈ గెలుపునకు కారణమని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. సుర్యకుమార్ బ్యాటింగ్ అద్భుతమని ప్రశంసించాడు.
అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి.. 193 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ 136 పరుగులకే ఆలౌటైంది.
"మాకున్న శక్తినంతా ఉపయోగించి ఆడాం. జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రతిభ దాగుంది కాబట్టే, వారికి ప్రోత్సాహం కల్పించాం. ముఖ్యంగా మా పేసర్లకు పరిస్థితులు బాగా అనుకూలించాయి. ఫీల్డింగ్ అద్భుతంగా చేశారు. నిజంగా ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఫీల్డింగ్ ప్రాక్టీసులో చాలా కష్టపడ్డాం. కష్టతరమైన క్యాచ్‌లను కూడా పట్టి గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది."
రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్
ఈ మ్యాచ్‌లో ముంబయి బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 47 బంతుల్లో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. "మ్యాచ్‌కు ముందు అతనితో మాట్లాడా. ఐపీఎల్లో సుర్యకుమార్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు" అని రోహిత్ పేర్కొన్నాడు.