సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించి 88 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దిల్లీ.. 19 ఓవర్లకే 131 పరుగులు చేసి ఆల్ఔట్ అయ్యింది. విజయంలో వృద్ధిమాన్ సాహా (87; 45 బంతుల్లో, 12×4, 2×6), డేవిడ్ వార్నర్ (66; 34 బంతుల్లో, 8×4, 2×6), మనీష్ పాండే(44) కీలక పాత్ర పోషించారు.
రెండో ఇన్నింగ్స్ చేసిన దిల్లీలో రిషభ్ పంత్(36) టాప్ స్కోరర్. రహానే(26) నామమాత్రంగా ఆడాడు. మిగతా వారు దారుణంగా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్(3), సందీప్ శర్మ(2), నటరాజన్(2), హోల్డ్ర్, విజయ్ శంకర్, షబాజ్ నదీమ్ తలో వికెట్ తీశారు.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌లో వృద్ధిమాన్ సాహా (87; 45 బంతుల్లో, 12×4, 2×6), డేవిడ్ వార్నర్ (66; 34 బంతుల్లో, 8×4, 2×6) అర్ధశతకాలతో చెలరేగడం వల్ల దిల్లీకి 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. వార్నర్‌సేనకు అదిరే ఆరంభం దక్కింది. ఆది నుంచే వార్నర్, సాహా దూకుడుగా ఆడుతూ పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేశారు. రబాడ వేసిన ఆరో ఓవర్‌లో వార్నర్ నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్ బాది 22 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు 25 బంతుల్లోనే అర్ధశతకం చేశాడు. అయితే అశ్విన్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి అక్షర్ పటేల్ చేతికి చిక్కడం వల్ల 107 పరుగుల తొలి వికెట్ భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం బౌండరీల బాదే బాధ్యతలు సాహా అందుకున్నాడు. ముచ్చటైన షాట్లతో స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 27 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఓవర్‌కు కనీసం ఒక బౌండరీ చొప్పున బాదుతూ పరుగులు రాబట్టాడు. అయితే నోర్జె అతడిని బోల్తా కొట్టించడం వల్ల స్కోరు వేగం తగ్గింది. ఆఖర్లో మనీష్ పాండే (44*; 31 బంతుల్లో, 4×4, 1×6) బ్యాటు ఝుళిపించడం వల్ల హైదరాబాద్ 219 పరుగులు చేసింది. విలియమ్సన్ (11*) దూకుడుగా ఆడలేకపోయాడు. దిల్లీ బౌలర్లలో అశ్విన్, నోర్జె చెరో వికెట్ తీశారు.