దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గత రాత్రి దిల్లీ క్యాపిటల్స్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో శ్రేయస్ అయ్యర్ టీమ్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ దిల్లీ కెప్టెన్ శ్రేయస్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.
"దిల్లీ జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. శ్రేయస్ తన వ్యూహాలతో బౌలింగ్‌లో మంచి మార్పులు చేశాడు. కోహ్లీసేన ఛేదనలో దిల్లీ కెప్టెన్ ఆదిలోనే బౌలర్లను మార్చడం వల్ల బెంగళూరుకు సరైన శుభారంభం దక్కలేదు. దీంతో బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడలేకపోయారు. అలాగే బెంగళూరు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నా ఈ మ్యాచ్‌లో తేలిపోయింది."
-సచిన్ తెందూల్కర్, టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా(42; 23 బంతుల్లో, 5x4, 2x6), శిఖర్ ధావన్(32; 28 బంతుల్లో 3x4) రెచ్చిపోయి శుభారంభం చేయగా.. తర్వాత రిషభ్ పంత్(37; 25బంతుల్లో 3x4, 2x6), మార్కస్ స్టాయినిస్(53; 26 బంతుల్లో 6x4, 2x6) చెలరేగారు. దీంతో శ్రేయస్ టీమ్ భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.
ఛేదనలో కోహ్లీసేన 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులే చేసింది. టాప్ ఆర్డర్‌లో పడిక్కల్(4), ఆరోన్ ఫించ్(13), డివిలియర్స్(9) విఫలమయ్యారు. కోహ్లీ(43; 39 బంతుల్లో 2x4, 1x6) ఆదుకునే ప్రయత్నం చేసినా అప్పటికే మ్యాచ్ దిల్లీ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు.