ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ అదరగొట్టింది. అబుదాబి వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నాలుగు వికెట్లకు 185 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలో లైఫ్ లభించిన క్రిస్ గేల్ (99; 63 బంతుల్లో, 6×4, 8×6) విధ్వంసం సృష్టించాడు. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెన్ స్టోక్స్ (50; 26 బంతుల్లో, 6×4, 3×6), సంజు శాంసన్ (48; 25 బంతుల్లో, 4×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' స్టోక్స్‌కు లభించింది. ఈ విజయంతో రాజస్థాన్ 12 పాయింట్లతో అయిదో స్థానానికి ఎగబాకింది.
ఛేదనకు దిగిన రాజస్థాన్‌కు గొప్ప ఆరంభం లభించింది. ఇన్నింగ్స్ ఆది నుంచే ఓపెనర్ స్టోక్స్ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ 24 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. కాగా, జోర్డాన్ వేసిన ఆరో ఓవర్‌లో షాట్‌కు యత్నించిన స్టోక్స్.. హుడా చేతికి చిక్కడంతో 60 పరుగుల వద్ద రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన శాంసన్ సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప (30; 23 బంతుల్లో, 1×4, 2×6) కూడా దూకుడు పెంచడంతో 10 ఓవర్లలో రాజస్థాన్ 103 పరుగులు సాధించింది. అయితే తర్వాతి ఓవర్‌లోనే ఉతప్పను మురుగన్ అశ్విన్ పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం సారథి స్టీవ్ స్మిత్ (31; 20 బంతుల్లో, 5×4)తో కలిసి శాంసన్ లక్ష్యాన్ని కరిగించాడు. అయితే అనవసర పరుగుకు ప్రయత్నించి శాంసన్ రనౌటవ్వడంతో పంజాబ్ రేసులోకి వచ్చింది. కానీ బట్లర్ (22; 11 బంతుల్లో, 1×4, 2×6), స్మిత్ పంజాబ్‌కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను లాగేసుకున్నారు. 24 బంతుల్లో 30 పరుగులు అవసరమవ్వగా షమి బౌలింగ్‌లో స్మిత్ మూడు ఫోర్లు, బట్లర్ ఒక బౌండరీ బాదడంతో రాజస్థాన్ విజయం లాంఛనమైంది.
సుడి'గేల్'
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. తొలిఓవర్‌లో మన్‌దీప్ సింగ్ (0)ను ఆర్చర్ ఔట్ చేశాడు. అయితే రాజస్థాన్‌కు ఆ ఆనందాన్ని గేల్ ఎక్కువసేపు ఉంచలేదు. రెండో ఓవర్ నుంచే కెప్టెన్ కేఎల్ రాహుల్ (46; 41 బంతుల్లో, 3×4, 2×6)తో కలిసి బౌండరీల మోత మోగిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. వరుణ్ ఆరోన్ వేసిన నాలుగో ఓవర్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గేల్ ఇచ్చిన కాస్త కష్టతరమైన క్యాచ్‌ను రియాన్ పరాగ్ వదిలేశాడు. అనంతరం గేల్ రాజస్థాన్ బౌలర్లపై మరింత చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 33 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. మరోవైపు కేఎల్ రాహుల్ సొగసైన షాట్లతో బౌండరీలు రాబట్టాడు. అయితే అర్ధశతకం దిశగా సాగుతున్న అతడిని స్టోక్స్ బోల్తా కొట్టించడంతో గేల్-కేఎల్ 120 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పూరన్ (22; 10 బంతుల్లో, 3×6)తో కలిసి గేల్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. కాగా, ఆఖరి ఓవర్‌లో ఆర్చర్ బౌల్డ్ చేయడంతో గేల్ 99 పరుగుల వద్ద వెనుదిరిగాడు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఇదీ చూడండి: టీ20ల్లో గేల్ ఒకే ఒక్కడు.. ఆ రికార్డు సొంతం