బయోబబుల్ వాతావరణాన్ని విలాసవంతమైన జైలుగా అభివర్ణించాడు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కాగిసొ రబాడా. ఈ కొవిడ్ ప్రపంచంలో ఎన్నో మిలియన్ల మంది తమ జీవనోపాధిని కోల్పోతుంటే తాను ఇంకా సురక్షితంగా ఉండటం అదృష్టమేనని అన్నాడు.
ఐపీఎల్ కోసం బుడగలో ఉన్న ఈ దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు.. శుక్రవారం నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్ కోసం మళ్లీ బయోబబుల్‌లోకి ప్రవేశించాడు. ఈ నేపథ్యంలోనే పై వ్యాఖ్యలు చేశాడు.
"బుడగలో ఉండటం కొంచెం కష్టమే. ఎవరితోనూ మాట్లాడలేము. మన స్వేచ్ఛను కోల్పోతాము. ఇందులో ఉండటమంటే ఓ విలాసవంతమైన జైలులో గడపటమే. కానీ ఇక్కడ ఉండటం అదృష్టమనే భావించాలి. చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ప్రస్తుతం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మేము ఆటలు ఆడుతూ డబ్బులు సంపాదించుకోగల్గుతున్నాము. మరీ దారుణమైన పరిస్థితుల్లో మేమేమి ఉండట్లేదు. గొప్ప హోటల్లో బస చేస్తున్నాం. పౌష్టికాహారం తింటున్నాం. కాకపోతే నాలుగు గోడల మధ్యనే ఉండటం కొంచెం కష్టంగా ఉంది. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.''
-కాగిసొ రబాడా, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్.
ఈ ఐపీఎల్లో రబాడా.. అత్యధికంగా 30 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పోలిస్తే ఐపీఎల్ చాలా సరదాగా ఉంటుందని అన్నాడు.
ఇదీ చూడండి అతడికి కెప్టెన్సీ ఇస్తే మరో రోహిత్ అవుతాడు!