హైదరాబాద్ జట్టు యువ ఆటగాళ్లపై ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసలు కురిపించాడు. చెన్నైపై చేజారిపోయిందనుకున్న మ్యాచ్‌ను గెలిపించారని పొగడ్తలు కురిపించాడు. ఇదే స్ఫూర్తిని తర్వాతి మ్యాచుల్లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. భువనేశ్వర్ గాయం గురించి ఇప్పుడే చెప్పలేనని అన్నాడు.
'ఈ గెలుపు యువ ఆటగాళ్లదే. బ్యాటింగ్, బౌలింగ్‌లో కుర్రాళ్లు ఇరగ్గొట్టేశారు. పరిస్థితులను అర్థం చేసుకొని ఒత్తిడిని చిత్తు చేసి మంచి ప్రదర్శన ఇచ్చారు. గాయం కారణంగా భువనేశ్వర్ మైదానం వీడినప్పుడు మాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. అందుకే 19వ ఓవర్‌లో ఐదు బంతులు ఖలీల్‌కు ఇచ్చాం. 20వ ఓవర్ తొలుత అభిషేక్‌కు ఇవ్వాలని అనుకున్నాం. కానీ సమద్ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని అతనికే ఆ బాధ్యతలు అప్పగించాం. సమద్ తన ఎత్తును బాగా సద్వినియోగం చేసుకున్నాడు. తెలివిగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లోనూ కుర్రాళ్లు బాగా ఆడారు. వాళ్ల ప్రదర్శన పట్ల నేను గర్వంగా ఉన్నాను. మిగిలిన యువఆటగాళ్లందరికీ ఈ మ్యాచ్ మంచి సందేశం' అని వార్నర్ చెప్పాడు.
జట్టును ముందుండి నడిపించే సీనియర్ ఆటగాళ్లు బెయిర్‌స్టో, వార్నర్, విలియమ్సన్ పది ఓవర్లలోపే పెవిలియన్ చేరారు. 14 ఓవర్లలో హైదరాబాద్ స్కోరు 81 పరుగులు. ఆ సమయంలో ప్రత్యర్థి ముందు కనీసం 140 పరుగుల లక్ష్యం నిర్దేశించగలదా అనే అనుమానం కలిగింది. కానీ, మిడిల్ ఆర్డర్‌లో యువ ఆటగాళ్లు ప్రియమ్ గార్గ్ 51 (26బంతుల్లో 6ఫోర్లు, సిక్సర్), అభిషేక్‌శర్మ 31 (24బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్) జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. దీంతో ప్రత్యర్థి ముందు 164 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. ఛేదనలో హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల హైదరాబాద్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.