షార్జా వేదికగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన 11 మ్యాచుల్లో ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్, ఆరింటిలో ఓడి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరులో గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను పదిలం చేసుకోవాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.
ఫుల్ జోష్‌తో పంజాబ్
లీగ్ ప్రారంభంలో వరుస ఓటములతో సతమతమైన పంజాబ్.. రెండో అర్ధభాగంలో గత నాలుగు మ్యాచుల నుంచి దుమ్మురేపుతోంది. ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకోవడానికి ఎంతో కసితో ఆడుతోంది. అయితే ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, గేల్.. సన్‌రైజర్స్‌పై జరిగిన గత మ్యాచ్‌లో తేలిపోయారు. పూరన్ పర్వాలేదనిపించాడు. మ్యాక్‌వెల్ విఫలమయ్యాడు. బౌలింగ్ యూనిట్లో మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, క్రిస్ జోర్డాన్‌తో బలంగానే ఉంది. మొత్తంగా జట్టులోని ఆటగాళ్లు తమ ప్రదర్శనను మెరుగుపరుచుకుని సమష్టిగా రాణిస్తే మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవడం ఖాయం.
కోల్'కథ' మారుతుందాా!
లీగ్ ప్రారంభం నుంచి అస్థిర ప్రదర్శన చేస్తోంది కోల్‌కతా. గత మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన వల్లే గెలిచింది. అయితే తమ జట్టులోని నితీశ్ రానా, నరైన్ మాత్రం అర్ధశతకాలతో అదరగొట్టారు. మిగతా వారు విఫలమయ్యారు. బౌలింగ్ యూనిట్లో వరుణ్ చక్రవర్తి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి అందరీ దృష్టినీ ఆకర్షించాడు. ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీశాడు. మిగతా వారు తేలిపోయారు. ఏదేమైనప్పటికీ గత మ్యాచ్‌లో చెలరేగిన రానా, నరైన్, చక్రవర్తితో పాటు మిగతా వారు తమ ప్రదర్శనను మెరుగుపరుచుకుంటే పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో రాణించవచ్చు.
ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకోవాలంటే!
పంజాబ్-కోల్‌కతా ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడితే అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే! అందుకే ఇరు జట్లు ఎలాగైనా గెలవాలనే కసితో బరిలో దిగుతున్నాయి. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.
జట్లు (అంచనా)
కోల్‌కతా నైట్‌రైడర్స్ : శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్, కమిన్స్, ఫెర్గుసన్, కమలేశ్ నాగర్కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
పంజాబ్ : కేఎల్ రాహుల్(సారథి), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్ దీపక్ హోడా, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్
ఇదూ చూడండి ఆ సిరీస్ కోసం దుబాయ్‌కి పుజారా, విహారి