కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. ఎపుడూ వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకోవడంలోనే బిజీగా ఉంటుంది. కానీ ఏ ఆటగాడూ ఈ జట్టుకు ట్రోఫీని అందించలేకపోయాడు. ఈసారి కూడా వేలంలో 26.2 కోట్లను ఖర్చు చేసింది. మ్యాక్స్‌వెల్, జోర్డాన్, కాట్రెల్ వంటి టీ20 స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దీంతో జట్టును పటిష్ఠం చేసుకుంది. అలాగే యువ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. మరి ఇప్పటివరకు టోర్నీలో ఆకట్టుకోని ఈ జట్టు ఈసారైనా అలరిస్తుందేమో చూడాలి. మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పంజాబ్ జట్టు బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకుందాం.
బలాలు
గత సీజన్లో ఈ మెగా లీగ్ నుంచి తప్పుకున్న స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఈసారి పునరాగమనం చేశాడు. టీ20ల్లో ఇతడికి మంచి రికార్డుంది. దీంతో ఇతడు ఈ జట్టుకు కీలకంగా మారే అవకాశం ఉంది. ఇతడి చేరికతో బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో జట్టుకు సమతుల్యం ఏర్పడినట్లు అయింది.
సారథి కేఎల్ రాహుల్, విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ రూపంలో ఈ జట్టుకు బలమైన ఓపెనింగ్ జోడీ కుదిరింది. గత సీజన్లో రాహుల్ అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌లో రెండో స్థానంలో నిలిచాడు. 14 మ్యాచ్‌ల్లో 53.9 సగటుతో 593 పరుగులు సాధించాడు. గేల్ కూడా 13 మ్యాచ్‌ల్లో 153.6 స్ట్రైక్ రేట్‌తో 490 పరుగులతో సత్తాచాటాడు. వీరిద్దరూ గతేడాది జట్టుకు శుభారంభాల్ని అందించారు. అదే ఫామ్‌ను ఈసారి కూడా కొనసాగించాలని చూస్తున్నారు.
అప్పర్ మిడిలార్డర్లో భారత యువ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, మన్దీప్ రాణించాలని జట్టు భావిస్తోంది. సర్ఫరాజ్ ఖాన్ తన క్రియేటిక్ షాట్స్‌తో ఎప్పుడూ అలరిస్తుంటాడు. ఈ ముగ్గురి వల్ల బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.
బలహీనతలు
స్పిన్ విభాగంలో ఎంతో అనుభవం కలిగిన రవిచంద్రన్ అశ్విన్‌ను వదులుకుంది పంజాబ్. ఇతడు గతేడాది 15 వికెట్లతో రాణించాడు. దీంతో ఈసారి వీరికి అనుభవం కగిలిన స్పిన్నర్ కరవయ్యాడు. మురుగన్ అశ్విన్, ముజిబుర్ రెహ్మన్లపైనే ఈ జట్టు ఆధారపడాల్సి ఉంది. యూఏఈ లాంటి స్పిన్ పిచ్‌లపై స్పిన్నర్ల కొరత ఉండటం ఈ జట్టుకు పెద్ద బలహీనత.
పేస్ బౌలింగ్‌లో మహ్మద్ షమీ గతేడాది 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో రాణించాడు. ఇతడికి మద్దతుగా నిలిచి చక్కటి ప్రదర్శన చేసిన సామ్ కురాన్ను ఈసారి పంజాబ్ వదులుకుంది. ఇతడి స్థానంలో షెల్డన్ కాట్రెల్‌ను తీసుకుంది. అలాగే స్పిన్నర్ జగదీశ సుచిత్‌ను కూడా కొనుగోలు చేసింది. అయినా ఈ జట్టు బౌలింగ్ విభాగంలో అంత పటిష్ఠంగా లేదు. అలాగే ప్రధాన బౌలర్లకు గాయాలైతే బ్యాకప్ ఆప్షన్ కనిపించడం లేదు.
అవకాశాలు
ఈ సీజన్లో పంజాబ్ బ్యాటింగ్ విభాగంలో బలంగా కనిపిస్తోంది. గేల్, రాహుల్ జోడీ కుదురుకుంటే మ్యాచ్‌ను వారివైపు తిప్పుకోవచ్చు. అలాగే బ్యాటింగ్ విభాగంలో ఈసారి కొన్ని రికార్డులు కూడా వీరు కొల్లగొట్టే అవకాశం ఉంది. మ్యాక్స్‌వెల్, మయాంక్ అగర్వాల్, మన్దీప్ సింగ్ రూపంలో కావాల్సినంత హిట్టింగ్ లైనప్ ఉంది. మిడిల్ ఓవర్స్‌లో పరుగుల వరద పారించేందుకు పాకెట్ రాకెట్ సర్ఫరాజ్ ఖాన్ ఉండనే ఉన్నాడు. అలాగే నికోలస్ పూరన్, హార్డస్ విజియోన్, జేమ్స నీషమ్, కరుణ్ నాయర్, క్రిస్ జోర్డాన్ వంటి నాణ్యమైన టీ20 బ్యాట్స్‌మన్ ఉన్నారు. దీంతో ఈసారి ఈ లైనప్ నుంచి 200కి పైగా పరుగులు ఆశించవచ్చు.
బౌలింగ్ విభాగంలో ఎలాంటి గాయాలు కాకుండా ఉంటే మహ్మద్ షమీ, ముజిబుర్ రెహ్మన్, షెల్డన్ కాట్రెల్, మురుగన్ అశ్విన్ వారి సత్తా మేరకు రాణించగలరు.
ప్రమాదాలు
గతేడాది పరుగుల వరద పారించిన కేఎ రాహుల్‌కు ఈసారి కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. దీంతో అందరి చూపు ఇతడిపైనే ఉంది. ఓ వైపు జట్టును నడిపిస్తూ బ్యాటింగ్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి. ఒకవేళ ఎక్కువ ఒత్తిడికి గురై తన బ్యాటింగ్ ఫామ్‌ను కోల్పోతే జట్టుకు పెద్ద దెబ్బే.
ఈ జట్టుకు చెప్పుకోదగ్గ ఆల్‌రౌండర్లు నీషమ్, మ్యాక్స్‌వెల్, క్రిస్ జోర్డాన్ మాత్రమే ఉన్నారు. ఒకవేళ వీరికి గాయాలైతే జట్టుకు కష్టమే.
యువ ఆటగాళ్లలో చాలా మందికి అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం లేదు. అలాగే ఒత్తిడిని ఎదుర్కోవడంలో అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు.
కొసమెరుపు
గత మూడేళ్లలో వరుసగా 5,6,7 స్థానాల్లో నిలిచిన పంజాబ్ 2014లో మాత్రం ఫైనల్‌కు చేరింది. తుదిపోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అప్పటి నుంచి ప్రతి సీజన్లో దిగజారుతూ వచ్చింది. కానీ ఈసారి వేలంలో భారీ ఖర్చు పెట్టి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మరి ఈసారైనా ఈ జట్టుకు అదృష్టం కలిసొస్తుందో లేదో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.