క్రీడల్లో భావోద్వేగానిది కీలక పాత్ర. వ్యూహాలు ప్రతి వ్యూహాల పోరాటాల్లో ఓ ప్రశంస క్రీడాకారునిలో రగిలించే స్ఫూర్తి దాని తాలూకు ప్రభావం అనిర్వచనీయం. అలాంటిది ఈసారి ఐపీఎల్లో క్రీడాకారులు అంతా భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ సంబరాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అందుకు కారణం కరోనా మహమ్మారి భయం.
ఐపీఎల్ టైం లైన్ లో సరిగ్గా ఓ పదేళ్లు వెనక్కి వెళ్తే.. కేకేఆర్‌కి, సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై బౌలర్ డగ్ బొలింజర్.. కేకేఆర్ కెప్టెన్ సౌరబ్ గంగూలీని ఔట్ చేశాడు. దీంతో ఆనందం పట్టలేక మిడ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సురేష్ రైనా పరిగెత్తుకుంటూ వచ్చి బౌలర్‌ని ప్రశంసించే ఆనందంలో బొలింజర్ తలపైన జుట్టు పట్టుకుని గట్టిగా లాగాడు. ఫలితంగా ఆ బౌలర్ ముంగురులు ఊడిపోయి రైనాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సంఘటన కొంచెం శృతిమించిందే అయినా క్రికెట్లో ప్రత్యేకించి ఐపీఎల్ లాంటి భారీ టోర్నీలో ఆటగాళ్లలో ఉండే భావోద్వేగ స్థాయికి ఆ సంఘటనే ఒక ఉదాహరణ.
నిజానికి ఓ ఆటగాడికి ప్రోత్సాహం అనేది చాలా అవసరం. ప్రత్యేకించి యువ ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు. ప్రపంచంలో విభిన్న దేశాలకు చెందిన ఆటగాళ్లను బ్యాట్‌తోనూ బంతితోనూ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు.. తెలియని ఒక రకమైన ఆందోళనకు లోనవుతూ ఉంటారు. వికెట్లను గిరాటేసేలా ఓ అద్భుత బంతి వేసినప్పుడో, కళ్లు చెదరగొట్టేలా రాకెట్ స్పీడ్‌తో బంతిని బలంగా బాదినప్పుడో సహజంగా ఆటగాళ్లు అందించే ప్రశంసలు వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. అలాంటిది కరోనా మహమ్మారి కారణంగా ఈసారి ఐపీఎల్లో సంబరాలకు ఆమడదూరంలో నిలవాల్సిన పరిస్థితి.
పెవిలియన్ నుంచి గ్రౌండ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి.. మ్యాచ్ గెలిచి సంబరాలు జరుపుకొనే వరకూ.. క్రీడాకారులు ఎన్నోసార్లు ఒకరిని ఒకరు తాకవలసి ఉంటుంది. కానీ ఈసారి ఐపీఎల్లో కొవిడ్ ప్రోటోకాల్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు. ఓ ఆటగాడు మరో ఆటగాడికి ఇచ్చే షేక్ హ్యాండ్ల పైనా ఆంక్షలు విధించారు. ఆటగాళ్లంతా బయో బబుల్ లోనే ఉన్నా.. వికెట్లు తీసినప్పుడో.. విన్నింగ్ షాట్లు బాదినప్పుడో చేసుకునే సంబరాలపైనా పరిమితులు విధించారు. ముంబయి-చెన్నై మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో ఈ మార్పులు స్పష్టంగా కనిపించాయి. సాధారణ కరచాలనానికు బదులుగా అడుగు దూరం పాటిస్తూ మోచేతులతో కానీ, గుప్పెట మూసి పిడికిలితో కానీ ఎదుటి వ్యక్తిని విష్ చేస్తూ ఆటగాళ్లు కనిపించారు. వికెట్లు తీసినప్పుడు గతంలోలా సహచర ఆటగాళ్లను హత్తుకోవడం, ఒకరిపై ఒకరు పడుతూ సంబరాలు చేసుకోవడం వంటివి కనపడలేదు.
అంతే కాదు.. స్టేడియం మొత్తం ఖాళీ ఉండడం వల్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు బదులుగా ప్రేక్షకులు కూర్చునే స్టాండ్ లను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. పెవిలియన్‌లో కూర్చునే ఆటగాళ్ల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు కనిపించాయి. జట్టులో 12వ ఆటగాడు మాత్రమే గ్రౌండ్లో ఆడేవారికి డ్రింక్స్ అందించేందుకు అనుమతినిచ్చారు. ఇలా ప్రతి చిన్న విషయంలోనూ.. ఐపీఎల్ నిర్వాహకులు అత్యంత జాగ్రత్తగా నిబంధనలు అమలు చేశారు.
ఐపీఎల్ ఎంతో ప్రతిష్టాత్మకమైన లీగ్. ఇటు ఆటగాళ్ల ప్రతిభ వేదిక పరంగానే కాదు.. వేల కోట్ల రూపాయల విలువ చేసే వ్యాపారం. కనుక ఈ టోర్నీ ప్రాధాన్యతను గుర్తించిన నిర్వాహకులు.. ఆటగాళ్లకు జట్టులో యాజమాన్యాలకు ముందు నుంచి కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా... అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన టోర్నీ జరుగుతున్నా.. వారంతా టీవీల ముందు సంబరాలు చేసుకోవాల్సిందే తప్ప.. ఆడుతున్న ఆటగాళ్లు మాత్రం భావోద్వేగాలను వీలైనంత నియంత్రించుకుంటూ కేవలం ఆటపైన దృష్టి సారించడం ఈసారి స్పష్టంగా కనిపించిన సరికొత్త మార్పు.