ఐపీఎల్ పదమూడో సీజన్ లీగ్ విజేతగా నిలిచింది ముంబయి ఇండియన్స్ జట్టు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో దిల్లీని చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ముంబయి సారథి రోహిత్ శర్మ.. తమ గెలుపుపై సంతోషం వ్యక్తం చేశాడు. కెప్టెన్గా తమ ఆటగాళ్లపై ఏరోజూ ఒత్తిడి తేలేదని చెప్పాడు. వచ్చే ఏడాది మనదగ్గరే ఐపీఎల్ జరగాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
"మా పై పెట్టిన ప్రతీ పైసాకు న్యాయం చేసేలా మొదటి బంతి దగ్గరి నుంచి శ్రమించాం. మా విజయానికి తెరవెనుక ఉన్నవాళ్లకు ఈ ఘనత దక్కతుంది. ఐపీఎల్ ప్రారంభం కంటే ముందు నుంచే మేం కృషి చేశాం. నేను ఏరోజూ బెత్తం చేతపుచ్చుకుని మా ఆటగాళ్ల వెంట ఉండి వారిని ఆడాలని ఒత్తిడి చేయలేదు. దురదృష్టవశాత్తు ఈసారి అభిమానుల సమక్షంలో ఆడలేకపోయాం. వాంఖడే స్టేడియంలో ఆడిన రోజులను చాలా మిస్ అయ్యాం. వచ్చే ఏడాది అక్కడే ఐపీఎల్ జరుగుతుందని ఆశిస్తున్నాను."
--రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ కెప్టెన్.
కప్ గెలిస్తే బాగుండేది..
ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్-13 ట్రోఫీ ఆశలను త్రుటిలో చేజార్చుకుంది దిల్లీ జట్టు. కానీ, తాము ఓడిపోయినా తమ ప్రదర్శనతో అభిమానుల మనసు గెలిచామని పేర్కొన్నాడు సారథి శ్రేయస్ అయ్యర్. తమ కోచ్ రికీ పాంటింగ్ తమలో అనునిత్యం స్ఫూర్తి నింపాడని కొనియాడాడు.
"రికీ పాంటింగ్ మాకు ఇచ్చిన స్వేచ్ఛ అముూల్యమైనది. ఆయన మా జట్టుతో జరిపిన సమావేశాలు, చెప్పిన మాటలు మాకు చాలా ప్రోత్సాహాన్ని అందించాయి. ఈ ఐపీఎల్ అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య జరిగింది. ఇందులో నేనూ ఓ భాగమైనందుకు సంతోషంగా ఉంది. మా జట్టు సభ్యులు మేం గర్వపడేలా ఆడారు. వారి వల్లే మేం ఫైనల్కు చేరుకోగలిగాం. అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాం. కప్ గెలిచి ఉంటే చాలా బాగుండేది. కానీ, వచ్చే సంవత్సరం ట్రోఫీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం."
--శ్రేయస్ అయ్యర్, దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబయి 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఇదీ చూడండి:ఐపీఎల్: మురిసిన ముంబయి.. ఐదో టైటిల్ కైవసం