ప్రస్తుత టీ20 క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లో ముంబయి తరఫున ఆడుతున్న ఇతడు.. ఈ సీజన్లో చెలరేగిపోతున్నాడు.దిల్లీ జట్టుతో క్వాలిఫయర్లో నాలుగు వికెట్లు తీసి సత్తాచాటాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ముంబయి బౌలింగ్ కోచ్ షేన్ బాండ్.. బుమ్రా నెంబర్ వన్ బౌలరంటూ ప్రశంసించాడు.
"బుమ్రా బౌలింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. పనితనంలో అతడిని టీ20 నెంబర్ వన్ బౌలర్ అని చెప్పొచ్చు. అలాగే బౌల్ట్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు నాకు 2012 నుంచి తెలుసు. అతడు మా జట్టులో ఉండటం సౌకర్యంగా ఉంటుంది"
-షేన్ బాండ్, ముంబయి బౌలింగ్ కోచ్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగుల భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్ (51), ఇషాన్ కిషన్ (55) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. చివర్లో హార్దిక్ పాండ్య 14 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఛేదనలో దిల్లీ తడబడింది. పరుగులేమీ చేయకుండానే 3 వికెట్లు కోల్పోయి చెత్త రికార్డు నమోదు చేసింది. మిడిలార్డర్లో ఆల్రౌండర్ స్టోయినిస్ 65 పరుగులు చేయడం వల్ల నిర్ణీత ఓవరన్నీ ఆడి 143 పరుగులతో నిలిచి ఓడిపోయింది.