ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ముంబయి ఇండియన్స్.. దానికి అడుగు దూరంలో ఉన్న దిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు (శనివారం) మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌ల్లో గెలిచి ముంబయి దూకుడుగా ఉండగా, హ్యాట్రిక్ ఓటములతో డీలా పడింది దిల్లీ. మరి ఇందులో విజయం సాధించేది ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
దడపుట్టిస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్.. అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో చోటు ఖరారు చేసుకుంది. ఇప్పుడు దిల్లీపైనా గెలిచి అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. గాయంతో బాధపడుతున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడే విషయమై ఫ్రాంచైజీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
మిగిలిన వారిలో డికాక్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్.. విజయాల్లో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. గత మ్యాచ్‌లో బెంగళూరుపై అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో బుమ్రా(20 వికెట్లు), బౌల్ట్(17 వికెట్లు) ద్వయం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. ప్యాటిన్సన్(11), రాహుల్ చాహర్(14).. వికెట్లు పడగొట్టడంలో తలో చేయి వేస్తున్నారు. ఇదే ఊపు కొనసాగితే దిల్లీపై గెలుపు పెద్ద కష్టమేమి కాదు.
ఓడితే దిల్లీకి కష్టమే!
సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో ఆకట్టుకున్న దిల్లీ జట్టు.. గత మూడు మ్యాచ్‌ల్లో పంజాబ్, కోల్‌కతా, హైదరాబాద్ చేతిలో ఓడింది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న శ్రేయస్ సేనకు మరో రెండు మ్యాచ్‌లే మిగిలున్నాయి. అవి కూడా బలమైన ముంబయి, బెంగళూరుతో. వీటిలో ఓడితే ప్లేఆఫ్స్ చేరడం దిల్లీకి కష్టమే!
జట్టులోని ఓపెనర్ శిఖర్ ధావన్‌కు(471 పరుగులు) సహకారం అందించడంలో మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవుతున్నారు. రహానె, పృథ్వీషా, పంత్, శ్రేయస్ అయ్యర్, హెట్మెయిర్, స్టోయినిస్ బ్యాటింగ్‌లో నిరాశపరుస్తున్నారు. బౌలింగ్‌లో రబాడ(23 వికెట్లు), ఎన్రిచ్(15) రాణిస్తున్నా.. మిగిలిన వారు వికెట్లు తీయలేకపోతున్నారు. దీంతో ప్రత్యర్థి జట్లపై విజయాలు సాధించలేకపోతుంది దిల్లీ. మరి భీకరంగా కనిపిస్తున్న ముంబయిని నిలువరిస్తుందా? లేదా అనేది చూడాలి.
జట్లు(అంచనా)
ముంబయి ఇండియన్స్: ఇషాన్ కిషన్, డికాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, హార్దిక్ పాండ్యా, పొలార్డ్ (తాత్కాలిక కెప్టెన్), కృనాల్ పాండ్యా, ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా
దిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, అజింక్యా రహానె, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్మెయిర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడ, తుషార్ దేశ్‌పాండే, ఎన్రిచ్