రెండు మ్యాచుల్లో గెలుపు దాకా వచ్చి ఓడిపోయినప్పటికీ డ్రస్సింగ్ రూమ్‌లో సానుకూల వాతావరణమే ఉందని పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అన్నాడు. వీటికి తాము కుంగిపోబోమని స్పష్టం చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత ఆటగాడని ప్రశంసించాడు. గేల్‌ను ఆడించడంపై జట్టు యాజమాన్యం ఇప్పటికే పూర్తి స్పష్టతనిచ్చిందని వెల్లడించాడు.
"నిజాయతీగా చెప్పాలంటే డ్రస్సింగ్ రూమ్‌లో చాలా సానుకూల వాతావరణం ఉంది. మాకింకా 11 మ్యాచులు ఉన్నాయి. మేం చాలా పనుల్ని సక్రమంగా చేస్తున్నాం. మేం గెలుపునకు దగ్గరగా వచ్చి ఓడిపోవడం నిజమే. కానీ మేం ఫలితాలపై దృష్టి పెట్టడం లేదు. ప్రణాళికలు అమలు చేయడం, నాణ్యమైన క్రికెట్ ఆడటంపై మేం సంతోషంగా ఉన్నాం."
-మయాంక్ అగర్వాల్, పంజాబ్ బ్యాట్స్‌మన్
క్రిస్ గేల్‌ను ఆడించకపోవడంపై మయాంక్ స్పందించాడు. "జట్టు యాజమాన్యం ఇప్పటికే దీనిపై స్పష్టత ఇచ్చింది. దాని గురించి మేం అతిగా ఆందోళన చెందడం లేదు. ప్రస్తుతం మేం ఆడుతున్న విధానం పట్ల, శుభారంభాల్ని అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. రాహుల్‌తో కలిసి ఆడటం బాగుంటుంది. అతడో అద్భుత ఆటగాడు. ఓపెనింగ్ ఎవరితో చేయించాలన్నది జట్టు కోచ్, కెప్టెన్ నిర్ణయిస్తారు. ఏ ప్రాతలోనైనా ఒదిగిపోవడం నాకిష్టం" అని అగర్వాల్ చెప్పాడు.