క్రికెట్ ప్రేమికులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ రేపటి(సెప్టెంబరు 19) నుంచి మొదలుకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్ సింగ్స్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అన్ని సీజన్లలోకెల్లా ఈసారి పూర్తి ప్రత్యేకం. ఎందుకంటే కరోనా ప్రభావం ఓవైపు, ఖాళీ మైదానాల్లో మ్యాచ్‌లు మరో వైపు.. భారత్‌లో కాకుండా విదేశాల్లో టోర్నీ నిర్వహణ ఇలా చాలా విశేషాలు ఉన్నాయి.
1. యూఏఈలో టోర్నీ
దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న కారణంగా ఈసారి లీగ్ ఇక్కడ జరపకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. యూఏఈలో నిర్వహించాలని భావించింది. మూడు మైదానాల్లో (అబుదాబి, షార్జా, దుబాయ్) ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
2. ఖాళీ స్టేడియాలు
ఏ క్రీడా పోటీలకైనా ఆకర్షణ ప్రేక్షకులే. వారి సందడి, ప్రోత్సాహం ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తుంది. కానీ ఈసారి మాత్రం కరోనా ప్రభావం వల్ల ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ జరగనుంది. టోర్నీ చరిత్రలో ఇలా కావడం ఇదే ప్రథమం.
3. మ్యాచ్ వేళల్లో మార్పు
ఈసారి మ్యాచ్‌ల వేేళల్లో మార్పులు జరిగాయి. సాధారణంగా రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్న.. ఈ సారి మాత్రం 7.30కే మొదలు కానున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3.30లకు షురూ అవుతాయి.
4. బయోబబుల్
ఈసారి కరోనా ప్రభావంతో ఆరోగ్య భద్రతా చర్యలు చేపట్టారు. యూఏఈ బయలుదేరేముందు ఆటగాళ్లు, సిబ్బందికి పలుమార్లు వైద్యపరీక్షలు చేశారు. అక్కడికి వెళ్లాక అందరినీ ఆరు రోజుల క్వారంటైన్లో ఉంచి మరో మూడుసార్లు టెస్ట్‌లు జరిపారు. ఇందులో నెగిటివ్‌గా తేలిన వారినే బయోబబుల్‌లోకి అనుమతించారు. అక్కడ కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.
5. భౌతిక దూరం
ఈసారి అన్ని ఫ్రాంచైజీలకు ముందుగానే నియమనిబంధనలు ఎలా ఉంటాయో చెప్పింది బీసీసీఐ. లీగ్ పూర్తయ్యే వరకు ఏ ఒక్క ఆటగాడు మరో ఆటగాడి గదికి వెళ్లకూడదు. గుంపులుగా సమావేశం కాకూడదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా భౌతిక దూరం పాటించాల్సిందే. ఇందుకోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి ఫ్రాంచైజీలు.
6. సుదీర్ఘంగా సాగే లీగ్
ఐపీఎల్ చరిత్రలో ఈసారి లీగ్ సుదీర్ఘంగా సాగనుంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది. అంటే 53 రోజుల పాటు, మొత్తం 60 మ్యాచ్‌లు జరగనున్నాయి.
7. చీర్ లీడర్స్ బంద్
ఈసారి లీగ్‌కు ప్రారంభోత్సవ వేడుకను రద్దు చేశారు. అలాగే ఆటగాళ్లను ఉత్సాహపర్చడానికి చీర్ లీడర్స్ కనిపించరు. మైదానాల్లో సాధ్యమైనంత తక్కువ మంది ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
8. వర్చువల్ కామెంటరీ
కొన్ని మీడియా కథనాల ప్రకారం ఈసారి కామెంటరీ వర్చువల్‌గా సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వ్యాఖ్యాతలకు, బీసీసీఐ ఇప్పటికే ప్రత్యేక సదుపాయాలు కల్పించింది.
9. కొత్త స్పాన్సర్
ఈసారి లీగ్‌కు టైటిల్ స్పాన్సర్ డ్రీమ్ ఎలెవన్. భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ వివోతో ఈ ఏడాది స్పాన్సర్‌షిప్‌ను వదులుకుంది బీసీసీఐ.
10. బంతిపై లాలాజలం రుద్దడం నిషేధం
కరోనా వల్ల బంతిపై లాలాజలం రాయకూడదని ఐసీసీ తేల్చిచెప్పింది. ఈ నిబంధనను అన్ని దేశాలు, లీగ్‌లు పాటించాల్సిందే. దీనిని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఎదుర్కవాల్సి ఉంటుంది.
వీటన్నింటి నడుమ ఈసారి లీగ్ సరికొత్తగా ఉండనుంది. దీంతో అందరి చూపు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ పైనే ఉంది. మరి లీగ్ ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.