ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ పదమూడో సీజన్ ఘట్టం ముగిసింది. దుబాయ్ వేదికగా జరిగిన తుది సంగ్రామంలో దిల్లీని చిత్తుచేసి, ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది ముంబయి ఇండియన్స్ జట్టు. ఈ నేపథ్యంలో వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను అవార్డులతో సత్కరించింది ఐపీఎల్ యాజమాన్యం.
కేఎల్ రాహుల్ (ఆరెంజ్ క్యాప్.. గేమ్ ఛేంజర్)
సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి అందించే ఆరెంజ్ క్యాప్‌ను పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ సొంతం చేసుకున్నాడు. 670 పరుగులతో సీజన్లో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు రాహుల్. అనూహ్యమైన తన ఇన్నింగ్స్‌లతో ఎన్నోసార్లు మ్యాచ్ రూపు రేఖలను మార్చేసినందుకు గాను.. గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ అవార్డునూ అందుకున్నాడు.
పర్పుల్ క్యాప్.. రబాడా
లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇచ్చే పర్పుల్ క్యాప్‌ను రబాడా(దిల్లీ క్యాపిటల్స్) దక్కించుకున్నాడు. ఐపీఎల్-13లో ఈ సౌతాఫ్రికా బౌలర్ మొత్తం 30 వికెట్లు తీశాడు.
ఎమర్జింగ్ ప్లేయర్.. పడిక్కల్
ఐపీఎల్లో ఈసారి ఆర్సీబీ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్‌కు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు వరించింది. ఈ సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన ఇతడు.. 473 పరుగుల్ని సాధించాడు. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఆరోస్థానంలో నిలిచాడు.
అత్యధిక సిక్సులతో.. ఇషాన్ కిషన్
ముంబయి ఇండియన్స్ తరఫున పదమూడు మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్ ఈసారి ఐపీఎల్లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 516 పరుగులు చేయగా.. అందులో 30 సిక్సర్లు ఉన్నాయి.
సూపర్స్ట్రైకర్గా పొలార్డ్..
ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌ల్లో కలిపి అత్యధిక స్ట్రైక్ రేట్(191.43) సాధించిన ఆటగాడిగా నిలిచాడు ముంబయి జట్టు హిట్టర్ పొలార్డ్. రోహిత్ శర్మ తొడ కండర గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమవగా.. ముంబయి ఇండియన్స్ సారథ్య బాధ్యతలను భుజానికెత్తుకున్నాడు పొలార్డ్.
ఫెయిర్ ప్లే అవార్డు ముంబయికే..
క్రీడాస్ఫూర్తిని కనబర్చినందుకు అందించే ఫెయిర్ ప్లే అవార్డును ఐపీఎల్ 2020 విజేత ముంబయి ఇండియన్స్ కైవసం చేసుకుంది. ముంబయి సారథి రోహిత్ శర్మ ఈ అవార్డును అందుకున్నాడు.
పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్.. బౌల్ట్
ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ ట్రెంట్ బౌల్ట్.. ఈ ఐపీఎల్ సీజన్లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.
మోస్ట్ వాల్యేబుల్(అత్యంత విలువైన ఆటగాడు) ప్లేయర్..
రాజస్థాన్ రాయల్స్ తరఫున 10 మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్.. ఈ సీజన్లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు. 20 వికెట్లు తీయడమే కాక.. కీలక సమయాల్లో పరుగులనూ రాబట్టాడు.
ఇదీ చూడండి:ఐపీఎల్: మురిసిన ముంబయి.. ఐదో టైటిల్ కైవసం