మ్యాచ్‌లను బాగానే ప్రారంభించినప్పటికీ ముగింపులో విఫలమవుతున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఆదివారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గెలుపుదాకా వచ్చి.. చివర్లో తడబడుతున్నామని అన్నాడు.
"ఏం మాట్లాడాలో.. ఎలా ప్రారంభించాలో అర్థం కావడం లేదు. గత మూడు మ్యాచుల్లో గెలుపు అంచుల దాకా వచ్చాం. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయాం. మ్యాచ్ ముగింపులో మేం విఫలమవుతున్నామనే విషయం స్పష్టమవుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే అని నేను భావిస్తున్నా. దుబాయ్‌తో పోల్చితే అబుదాబి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైంది. కానీ.. ఇన్నింగ్స్ మధ్య ఓవర్లలో బ్యాటింగ్‌కు ఇబ్బందికరంగా మారింది. నిజానికి 165-170 పరుగుల లక్ష్యం ఛేదించదగిందే. కానీ.. ఛేదనలో మా జట్టు కీలక సమయంలో వికెట్లు కోల్పోయింది. విలియమ్సన్ గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ చేశాడు. అతడిని ఫిజియో పరిశీలిస్తున్నాడు. తర్వాతి మ్యాచ్‌లకు కేన్ అందుబాటులో ఉంటాడని భావిస్తున్నాం."
- డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్
ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఆ ఓవర్‌లో హైదరాబాద్ కేవలం 2 పరుగులే చేసింది. సులువైన లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను రషీద్‌ఖాన్ కాస్త ఇబ్బంది పెట్టాడు. కానీ.. ఓటమిని మాత్రం అడ్డుకోలేకపోయాడు. ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ మూడు విజయాలు, 6 ఓటములతో ఉంది. మ్యాచ్ ఓడినప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న వార్నర్‌సేన పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.