యూఏఈలో జరుగుతున్న టీ20 మెగా లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్, యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ సత్తా చాటాడు. టోర్నీ ఆరంభంలో కరోనా బారిన పడి కొన్ని మ్యాచులకు దూరమైన ఈ ఆటగాడికి తర్వాత మ్యాచుల్లో స్థానం దక్కినా పెద్దగా రాణించక విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే చెన్నై జట్టు ఆడిన చివరి మూడు మ్యాచుల్లో గైక్వాడ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వరుస ఓటములతో చెన్నై జట్టు సతమతమవుతున్న సమయంలో తమ జట్టులోని యువ ఆటగాళ్లలో ఆడాలనే కసి కనిపించలేదని ధోనీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో జట్టులో చోటు దక్కించుకున్న గైక్వాడ్ హ్యట్రిక్ అర్ధశతకాలతో జట్టుకు మంచి విజయాలు అందించాడు.
ఈ నేపథ్యంలో గైక్వాడ్‌పై ఆ జట్టు స్టార్ ఆటగాడు డుప్లెసిస్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ యువ ఆటగాడి కొన్ని షాట్లు, ఆటతీరును గమనిస్తే యంగ్ విరాట్ కోహ్లీని చూసినట్లు ఉందని డుప్లెసిస్ తెలిపాడు. క్లిష్ట సమయాల్లో గైక్వాడ్ ఒత్తిడిని జయించి రాణించాడని పేర్కొన్నాడు. ఇటువంటి ప్రదర్శనలే యువ ఆటగాళ్ల భవిష్యత్‌లో ఉత్తమంగా రాణించగలరో లేదో నిర్ణయిస్తాయని ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్ గెలిచిన అనంతరం డుప్లెసిస్ అన్నాడు.
ఈ ఐపీఎల్‌లో ఆరు మ్యాచులాడిన రుత్‌రాజ్ గైక్వాడ్ 204 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇది వరకే ఫ్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై.. లీగ్‌లో చివరి మ్యాచ్ ఆదివారం పంజాబ్‌తో ఆడింది. ఇందులో భారీ విజయాన్ని కైవసం చేసుకుని విజయంతో లీగ్ నుంచి నిష్క్రమించింది.
ఇదీ చూడండి:సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేనా?