ఐపీఎల్ రెండో మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన పోరులో దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ మధ్య మ్యాచ్ తొలుత టై అయింది. దిల్లీ 157 పరుగులు చేయగా.. పంజాబ్ సైతం అదే స్కోరు వద్ద నిలిచింది. పంజాబ్ తరపున 89 పరుగులు చేసి మ్యాచ్ టైగా ముగియడంలో కీలకంగా వ్యవహరించాడు మయాంక్ అగర్వాల్. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఇందులో దిల్లీ సునాయాస విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటిన స్టోయినిస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ.. ఆరంభంలో వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అయ్యర్(39)-పంత్(31) స్కోరు బోర్డును నెమ్మదిగా పరుగులు పెట్టించారు. నాలుగో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరారు. చివర్లో వచ్చిన స్టోయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 21 బంతుల్లో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీశాడు. పంజాబ్ బౌలర్లలో షమి 3, కాట్రెల్ 2, రవి బిష్ణోయ్ ఓ వికెట్ పడగొట్టారు.
ఛేదనను బాగానే ఆరంభించిన పంజాబ్.. 30 పరుగుల వద్ద కెప్టెన్ కేఎల్ రాహుల్(21) వికెట్ పోగొట్టుకుంది. అనంతరం వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. తర్వాత వచ్చిన క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్.. క్రిష్ణప్ప గౌతమ్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కబెట్టే బాధ్యత తీసుకున్నాడు. దిల్లీ నుంచి మ్యాచ్‌ను పూర్తిగా లాగేసుకున్నట్లే కనిపించినా.. చివరి నిమిషంలో ఔటై వెనుదిరిగాడు మయాంక్. దిల్లీ తరపున రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు, రబడ 2, మోహిత్ శర్మ, అక్సర్ పటేల్ తలో వికెట్ తీశారు.
సూపర్ ఓవర్ ధమాకా
సూపర్ ఓవర్లో పంజాబ్ పూర్తిగా విఫలమైంది. రెండు పరుగులకే పరిమితమైంది. పంజాబ్ తరపున జట్టు సారథి కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్ బరిలోకి దిగారు. తొలి బంతికి రెండు పరుగులు చేసిన రాహుల్.. రెండో బంతికి ఔట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు. వెంటనే మూడో బంతికి నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దిల్లీ తరఫున రబడ సూపర్ ఓవర్‌కి బౌలింగ్ చేశాడు.
అనంతరం దిల్లీ తరఫున శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చారు. తొలి బంతి డాట్ బాల్ కాగా.. రెండో బంతిని వైడ్ విసిరాడు పంజాబ్ బౌలర్ షమి. తర్వాతి బంతికి రెండు పరుగులు తీశాడు పంత్. దీంతో విజయ సంబరాల్లో మునిగితేలింది దిల్లీ జట్టు.