అబుదాబి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ధోనీసేన గెలవడం వల్ల పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతవ్వడం సహా టోర్నీ లీగు దశలోనే వైదొలిగింది. ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ (62) హాఫ్ సెంచరీతో అలరించగా.. ఫాఫ్ డుప్లెసిస్ (48), అంబటి రాయుడు (30) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సీఎస్కేకు గెలుపును అందించారు.
దీపక్ హుడా అర్థశతకం
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు బ్యాట్స్‌మన్ దీపక్ హుడా అర్ధశతకంతో చెలరేగి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఫలితంగా 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందుంచింది. మొదట పంజాబ్‌కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (29), మయాంక్ అగర్వాల్ (26) ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు. ఎంగిడి బౌలింగ్‌లో మయాంక్ ఔటైనప్పటికీ పవర్‌ప్లేలో 53 పరుగులతో గొప్ప స్థితిలోనే నిలిచింది. అయితే తర్వాత చెన్నై బౌలర్లు పుంజుకుని స్వల్ప వ్యవధిలోనే రాహుల్, నికోలస్ పూరన్ (2), క్రిస్ గేల్ (12)ను పెవిలియన్‌కు చేర్చారు.
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడా ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చాడు. మన్‌దీప్ సింగ్ (14)తో కలిసి తొలుత నిదానంగా ఆడిన అతడు తర్వాత గేర్ మార్చి చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. చెన్నై బౌలర్లలో ఎంగిడి మూడు వికెట్లు, జడేజా, తాహిర్, శార్దూల్ తలో వికెట్ తీశారు.