ఐపీఎల్‌ను గెలుపుతో ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. బౌలింగ్‌లో జట్టు పర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం విఫలమవుతోంది. మొదటి మ్యాచ్‌లో సత్తాచాటిన రాయుడు తర్వాత రెండు మ్యాచ్‌లు ఆడలేదు. అందువల్ల ఈ జట్టు టాప్ ఆర్డర్లో బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అభిమానులు రైనా మళ్లీ రావాలంటూ నెట్టింట ట్వీట్లు చేస్తున్నారు.
టీ20 లీగ్ కోసం దుబాయ్‌కు వెళ్లిన రైనా తన కుటుంబ కారణాల వల్ల భారత్‌కు తిరుగు పయనమయ్యాడు. ఈసారి చెన్నై జట్టుకు అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేశాడు. చెన్నై తరఫున ఎన్నో రికార్డులు రైనా పేరిట ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో తన బ్యాటింగ్ విన్యాసాలతో జట్టును గెలిపించాడు. ఇప్పుడు రైనా లేకపోవడం వల్ల ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. రైనా లేని టాప్ ఆర్డర్ బ్యాటింగ్ పేలవంగా మారిపోయింది. తొలి మ్యాచ్‌లో ముంబయితో రాయుడు, డుప్లెసిస్ కలిసిగట్టుగా రాణించి జట్టును గెలిపించారు. రాయుడు జట్టుకు దూరమైన తర్వాత డుప్లెసిస్‌కు ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ తోడుగా నిలవడం లేదు. డుప్లెసిస్ ఒక్కడే ఎంత పోరాడినా మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చలేకపోతున్నాడు. దీంతో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌పై అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
రైనా.. నువ్వు మళ్లీ తిరిగిరావా.. జట్టులో నువ్వు లేని తేడా స్పష్టంగా కనిపిస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతన్నారు. చెన్నై యాజమాన్యం ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే ఏం ప్రయోజనం ఉండదని మరొకరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.