ఐపీఎల్లో వరుస విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయని ముంబయి కోచ్ జయవర్దనే అన్నాడు. తమ వద్ద కొన్ని కొత్త వ్యూహాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఆయన మాట్లాడిన వీడియోను ముంబయి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు రోహిత్‌సేన 6 మ్యాచులు ఆడగా నాలుగు గెలిచి రెండు ఓడిపోయింది. ఒకే వారంలో మూడు మ్యాచులు ఆడిన ఆ జట్టుకు ఇప్పుడు కాస్త విరామం దొరికింది.
"ప్రస్తుతం మేం అత్యంత నిలకడగా క్రికెట్ ఆడుతున్నాం. బ్యాటు, బంతితో నైపుణ్యాలను చక్కగా అమలు చేస్తున్నాం. అంతా సవ్యంగానే సాగుతున్నా మేమింకా మెరుగుపడాల్సిన విభాగాలు ఉన్నాయి. అందుకే మేం వాటిపై రోజూ దృష్టి పెట్టాల్సిందే."
- జయవర్దనే, ముంబయి ఇండియన్స్ కోచ్
రాజస్థాన్‌పై 57 పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్ గురించి జయవర్దనే స్పందించాడు. "మా వద్ద కొన్ని ప్రణాళికలున్నాయి. ఆ మ్యాచ్‌కు సంబంధించి భిన్నమైన వ్యూహాలు అమలు చేశాం. బుమ్రాతో ముందుగా బౌలింగ్ చేయించాం. వికెట్‌పై మూవ్‌మెంట్ కనిపించడం వల్ల విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం" అని ముంబయి కోచ్ చెప్పాడు.
బౌల్ట్, బుమ్రా కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేశారని జయవర్దనే ప్రశంసించాడు. ప్యాటిన్సన్ కూడా మంచి లెంగ్త్‌లో బంతులు విసిరాడని పేర్కొన్నాడు. స్పిన్నర్లూ మెరుగ్గా రాణించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఎంత బాగా ఆడగలడో తనకు తెలుసని పేర్కొన్నాడు. వారం రోజుల్లోనే మూడు మ్యాచులాడి వరుస విజయాలు సాధించిన తమ జట్టుకు కొంత విరామం దొరకడం సంతోషకరమని జయవర్దనే తెలిపాడు.