మైదానంలో తెల్లని షూ వేసుకుని బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతానని అంటున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తనకు అదో మూఢ నమ్మకంగా భావిస్తున్నట్లు మాంచెస్టర్ సిటీ బాస్ పెప్ గార్డియోలాతో పాల్గొన్న ఇన్స్టాగ్రామ్ లైవ్లో వెల్లడించాడు.
"తెల్లని షూ వేసుకుని బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టం. నాకు అదో మూఢనమ్మకం. నేను బ్యాటింగ్ చేసేటపుడు సమయానికి తగ్గట్టుగా నాకున్న పరిధిలో ప్రదర్శన ఇవ్వడంపై పూర్తిగా దృష్టి సారిస్తా."
- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
తాను ఆడే రోజుల్లో ఏ రంగు బూట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని కోహ్లీ.. గార్డియోలాను అడిగాడు. దానికి సమాధానమిస్తూ.."నేను ఆడే సమయంలో వాడే షూ నల్లగా ఉండేవి. ఇప్పుడు బ్లాక్ షూ దొరకడం కష్టం. ఒకరోజు నేను ఎర్ర బూట్లను ధరించడం చూసిన నా గురువు, మేనేజర్ జోహన్ క్రూఫ్ నా కోసం నల్లని బూట్లను తయారు చేయించాడు" అని చెప్పాడు.
కరోనా మహమ్మారి తర్వాత అభిమానులు లేకుండా ఫుట్బాల్ మ్యాచ్లు ఆడడంపై గార్డియోలా స్పందించాడు. "ప్రేక్షకులు లేకపోతే ఇది పోటీలా లేదు. ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ను తలపిస్తోంది. వాళ్లు లేకుండా మ్యాచ్ ఆడటం చాలా భిన్నంగా ఉంది. పరిస్థితులు అన్నీ మెరుగయ్యాక ప్రేక్షకులు స్టేడియాలకు వస్తారని ఆశిస్తున్నా" అని అన్నాడు.