బెంగళూరు- ముంబయి మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో విరాట్‌కోహ్లీ అంపైర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని లసిత్ మలింగ నోబాల్ వేయగా, అంపైర్ దీనిని ప్రకటించలేదు. ఈ విషయంపై ఘాటుగా స్పందించిన విరాట్.. తాము ఐపీఎల్లో ఆడుతున్నామని, క్లబ్ క్రికెట్లో కాదని అంపైర్ ఎస్. రవిపై విమర్శలు చేశాడు.
"ఇది చాలా దారుణం. మేము క్లబ్ స్థాయి క్రికెట్ కాదు, ఐపీఎల్ ఆడుతున్నాం. అంపైర్లు సరిగ్గా గమనించి ఉండాల్సింది. అది నో బాల్ అని స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి కీలకాంశాలే గెలుపోటములను నిర్ణయిస్తాయి. కాసేపు నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. అంపైర్లు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది" --విరాట్ కోహ్లీ, బెంగళూరు సారథి.
విరాట్‌కు ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు పలికాడు. అంపైరింగ్ విషయంపై రోహిత్ కూడా విమర్శించాడు. 19వ ఓవర్లో బుమ్రా వేసిన బంతి వైడ్ కాకాపోయినా అంపైర్ వైడ్‌గా ప్రకటించాడని ముంబయి సారథి అసంతృప్తి వ్యక్తం చేశాడు.
బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 187 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆర్సీబీ 20 ఓవర్లలో 181 పరుగులు చేసి పరాజయం చెందింది. చివరి బంతికి 7 పరుగులు అవసరమవగా మలింగ నో బాల్ వేశాడు. కానీ అంపైర్ నో బాల్‌గా ప్రకటించపోయేసరికి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.