వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి... మంచి ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 8 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై జోరుకు గత మ్యాచ్‌లో అడ్డుకట్ట వేసింది ముంబయి. అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని చూస్తోంది. మరోవైపు సన్‌రైజర్స్ జట్టులో బెయిర్‌స్టో, వార్నర్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. మరోసారి వీరు అదే ఊపులో ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్...
దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో విలియమ్స్‌న్ లేకుండానే బరిలో దిగింది సన్‌రైజర్స్ జట్టు. గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైనా జట్టులో ఆ ప్రభావం పెద్దగా కనపడలేదు. భువనేశ్వర్ సారథ్యంలో వరుస విజయాలను అందుకుంది హైదరాబాద్ జట్టు. గత మ్యాచ్‌లో బెయిర్‌స్టో 48 పరుగులతో మరోసారి విజృభించాడు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో బీకరంగా ఆడిన వార్నర్ మరోసారి సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్‌లతో హైదరాబాద్ బౌలింగ్ భీకరంగా ఉంది సన్‌రైజర్స్. గత రెండు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లతో అదరగొట్టిన నబీ కూడా వీరితో జత కలిశాడు.
ముంబయి ఇండియన్స్...
రోహిత్‌శర్మ, యువరాజ్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, డికాక్, పోలార్డ్, పాండ్య సోదరులతో ముంబయి బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. హిట్టర్లకు కొదవలేని రోహిత్ సేనకు ప్రతి ఆటగాడు మ్యాచ్ మలుపుతిప్పే సామర్థ్యం కలవాడే. గత మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(59), కృనాల్ పాండ్య(42) ఆకట్టుకున్నారు. ఆ మ్యాచ్‌లో ముంబయి 170 పరుగులు చేసింది. అయినా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నైని 133కే పరిమితం చేశారు. బుమ్రా, మెక్లెనిగన్, పాండ్య సోదరులతో బౌలింగ్‌లో పటిష్ఠంగా ఉంది ముంబయి ఇండియన్స్ జట్టు.
జోరు మీదున్న వార్నర్, బెయిర్‌స్టోను ముంబయి బౌలర్లు ఏ మేరకు కట్టడి చేస్తారో చూడాలి.
జట్ల అంచనా..
సన్‌రైజర్స్ హైదరాబాద్:
భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విజయ్‌శంకర్, మనీశ్ పాండే, దీపక్ హుడా, యూసుఫ్ ఫఠాన్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ కౌల్, షకీబ్ అల్ హసన్, మార్టిన్ గప్తిల్, సాహా.
ముంబయి ఇండియన్స్:
రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, కృనాల్ పాండ్యా, హార్ధిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, రాహుల్ చాహర్, బుమ్రా, మెక్లెనిగన్, జాసన్ బెహ్రెండార్ఫ్, బెన్ కట్టింగ్, ఆదిత్య తారె.