ఈ సీజన్లో తాము జట్టుగా బాగా ఆడామని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రతీ బౌలర్ అద్భుతంగా రాణించాడని, చివర్లో మలింగ చక్కటి ప్రదర్శన చేశాడని రోహిత్ ఆనందం వ్యక్తం చేశాడు.
"చివరి ఓవర్ నేను హార్ధిక్ పాండ్యకు ఇద్దామనుకున్నా. కానీ ఎవరైన అనుభవజ్ఞులకు ఇస్తే బాగుంటుందని నిర్ణయాన్ని మార్చుకున్నా. ఈ పరిస్థితుల్లో మలింగానే సరైన బౌలర్ అనుకొని అతడికి బంతినిచ్చా. అనుకున్నట్టుగానే మలింగ అద్భుతం చేశాడు. అతడో ఛాంపియన్" - రోహిత్ శర్మ, ముంబయి కెప్టెన్
ఈ విజయంతో రోహిత్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఎక్కువ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లకు ఆడిన ఆటగాడిగా ఘనత సాధించాడు. రోహిత్ 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. 4 సార్లు ముంబయి తరపున, ఓ సారి డెక్కన్ ఛార్జర్స్ తరపున ప్రాతినిథ్యం వహించాడు.
చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ముంబయి ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. బుమ్రా రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. మలింగ చివర్లో అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ గెలిపించాడు.