ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. కోల్‌కతా నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది రాయల్స్. యువ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ తన ఆటతో ఆకట్టుకున్నాడు.
176 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు అద్భుత ఆరంభం లభించింది. ఓపెనర్లు రహానే, సంజూ శాంసన్ తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 34 పరుగులు చేసిన రహానే.. నరైన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. శాంసన్ 22 పరుగులు చేసి ఔటయ్యాడు.
పరాగ్ అదరగొట్టాడు..
రాజస్థాన్ యువ సంచలనం రియాన్ పరాగ్ తన బ్యాటింగ్‌తో మరోసారి అదరగొట్టాడు. 31 బంతుల్లో 47 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అనూహ్యంగా హిట్ వికెట్‌గా అవుటై అర్ధశతకాన్ని కాస్తలో చేజార్చుకున్నాడు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో స్మిత్ 2 పరుగులు, స్టోక్స్ 11, బిన్నీ 11, శ్రేయస్ గోపాల్ 18 పరుగులు చేశారు. చివరి ఓవర్లో సిక్స్ కొట్టి రాజస్థాన్‌కు విజయాన్ని అందించిన జోప్రా ఆర్చర్ 27 పరుగులు చేసి రాణించాడు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్... ఐపీఎల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు.
కోల్‌కతా బౌలర్లలో పియూష్ చావ్లా 3 వికెట్లు తీశాడు. నరైన్ రెండు, ప్రసిద్ధ్ కృష్ణ, రసెల్ తలో వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభమైంది. ఓపెనర్ లిన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. మిగతా బ్యాట్స్‌మెన్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. గిల్ 14, నితీశ్ రానా 21 పరుగులు చేసి ఔటయ్యారు.
కెప్టెన్ నిలిచాడు..
కోల్‌కతా 175 పరుగులు చేసిందంటే కారణం దినేశ్ కార్తిక్. కెప్టెన్‌గా అతడు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కార్తీక్‌కు ఐపీఎల్లో ఇదే అత్యధిక స్కోరు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో నరైన్ 11, రసెల్ 14, బ్రాత్‌వైట్ 5, రింకూ సింగ్ 3 పరుగులు చేశారు.
రాజస్థాన్ బౌలర్లలో వరున్ ఆరోన్ 2 వికెట్లు తీశాడు. థామస్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు. వరుణ్ ఆరోన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.