టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ముంబయికి బ్యాటింగ్ అప్పగించింది. రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు రోహిత్, డికాక్ జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చారు. వీరి ధాటికి మొదటి 6 ఓవర్లలో 52 పరుగులు వచ్చాయి. అనంతరం డికాక్ (23) ఔటయ్యాడు. రోహిత్ కాసేపు బ్యాట్‌కి పనిచెప్పినా 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ బాట పట్టాడు. యువరాజ్ (23), సూర్యకుమార్ యాదవ్ (38), పాండ్యా (31) మెరిశారు.
బెంగళూరు బౌలర్లలో చాహల్ 4 వికెట్లు దక్కించుకోగా, ఉమేష్, సిరాజ్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.
188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఓపెనర్ మొయిన్ అలీ వికెట్‌ను తొందరగానే కోల్పోయింది. కోహ్లీ, పార్థివ్ కాసేపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కోహ్లీ 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. కోహ్లీ ఐపీఎల్లో 5 వేల పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. డివిలియర్స్ 70 పరుగులతో అజేయంగా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు.
ముంబయి బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా.. మార్కండే ఒక వికెట్ సాధించాడు.
చివర్లో ఉత్కంఠ
చివరి రెండు ఓవర్లలో విజయానికి 22 పరుగులు అవసరం కాగా 19వ ఓవర్లో బుమ్రా కేవలం 5 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. చివరి ఓవర్లో బెంగళూరుకు 17 పరుగులు అవసరమయ్యాయి. మలింగ బాల్ అందుకున్నాడు. మొదటి బంతిని సిక్స్ గా మలిచాడు దుబే. తర్వాతి 4 బంతులకు కేవలం సింగిల్సే వచ్చాయి. ఆఖరి బంతికి 7 పరుగులు చేయాల్సి వచ్చింది. పరగులేమీ రాలేదు. ముంబయి 6 పరుగుల తేడాతో గెలిచింది.
ఆఖరి బంతి వివాదం
చివరి బంతికి పరుగులేమీ రాలేదు. కానీ ఆఖరి బంతి నోబాల్. అయితే అంపైర్ నోబాల్‌గా ప్రకటించలేదు. కోహ్లీ సహా బెంగళూరు జట్టు విస్మయానికి గురైంది.
ఇదీ చూడండి:ముత్తయ్యకు దూస్రా నేర్పిన కోచ్ అస్తమయం