డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిదో సారి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో దిల్లీపై 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది చెన్నై. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోని.. ఈ సీజన్‌లో చెన్నై ప్రదర్శనకు, ఫైనల్ చేరేందుకు కారణం జట్టులోని బౌలర్లే అంటూ ప్రశంసించాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్లకు 147 పరుగులే చేయగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టులో డుప్లెసిస్, వాట్సన్ అర్ధ సెంచరీలతో చెలరేగడం వల్ల అలవోకగా విజయం సాధించింది.
‘మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టడమే కీలకం. కాబట్టి ఈ ఘనత బౌలర్లకు ఇవ్వాల్సిందే. తనకు ఏం కావాలో కెప్టెన్ అడుగుతాడు. వారు ఎలా బౌలింగ్ చేయాలి, వికెట్లు ఎలా తీయాలి అన్నది నిర్ణయించుకుంటారు. ఈ సీజన్‌లో మేం ఇక్కడ ఉన్నామంటే అందుకు బౌలర్లే కారణం. మా బౌలింగ్ బృందానికి కృతజ్ఞతలు’ -ధోని, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్
మే 12న హైదరాబాద్ వేదికగా జరిగే ఫైనల్ పోరులో ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇరుజట్లలోని ఏ టీమ్ విజయం సాధించినా నాలుగోసారి ఐపీఎల్ కప్పును అందుకుంటుంది.