రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జయపుర వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 159 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది రాజస్థాన్. జాస్ బట్లర్ (59) అర్ధశతకంతో చెలరేగగా, స్టీవ్ స్మిత్ (38) రాణించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 158 పరుగులకే పరిమితమైంది. శ్రేయాస్ గోపాల్ మూడు వికెట్లు తీసి బెంగళూరు పతనాన్ని శాసించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శ్రేయాస్ అయ్యర్‌కే దక్కింది.
బట్లర్ భలే బ్యాటింగ్...
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్‌కు శుభారంభం దక్కింది. బట్లర్- రహానే జోడి తొలి వికెట్‌కు 60 పరుగులు నమోదు చేసింది. అనంతరం రహానే(22) ఔటైనా.. బట్లర్, స్మిత్ నిలకడగా ఆడారు. అర్ధ శతకం తర్వాత బట్లర్.. చాహల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
మరో వికెట్ పడకుండా స్మిత్- త్రిపాఠి జోడీ జాగ్రత్తగా ఆడింది. స్మిత్ వెనుదిరిగాక స్టోక్స్‌తో త్రిపాఠి మ్యాచ్‌ను ముగించాడు. బెంగళూరు బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీశాడు.
- మొదటి 8 ఓవర్లకు 70కిపైగా పరుగులు సాధించింది బెంగళూరు జట్టు. 22పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి.. శ్రేయాస్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. కొద్ది వ్యవధిలోనే డివిలియర్స్, హిట్మైర్ వికెట్లను కోల్పోయింది బెంగళూరు.
- పార్థివ్ పటేల్(67) అర్ధ శతకంతో ఆకట్టుకున్నా మిగతా బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడలేకపోయారు. వికెట్లు చేతిలో ఉన్నా స్కోరు వేగం పెంచలేకపోయింది ఆర్సీబీ.
- రాజస్థాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్ 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్ ఓ వికెట్ తీసుకున్నాడు.