Footballer Mohammad Habib Died : క్రీడాలోకంలో మరో విషాదం నెలకొంది. ఇండియన్ ఫుట్‌బాల్ లెజెండ్, హైదరాబాద్‌కు చెందిన ప్లేయర్ మహ్మద్ హబీబ్(74) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా డిమెన్షియా అండ్ పార్కిన్సన్స్ సిండ్రోమ్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నేడు(ఆగస్ట్ 15)న తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో 1949 జులై 17న జన్మించిన ఆయన.. హైదరాబాద్‌లోనే కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. 1970 బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆసియన్ గేమ్స్‌లో మరో హైదరాబాదీ ప్లేయర్ సయ్యద్ నయీముద్దీన్ కెప్టెన్సీలో ఆడిన హబీబ్.. బ్రాంజ్ మెడల్‌ను అందుకున్నారు. ఇంకా ఎన్నో ఘనతలను అందుకున్నారు. ఫుట్‌బాల్ కోచ్‌గా కూడా వ్యవహరించారు.
కాగా, 60, 70 దశకాల్లో స్వర్ణయుగం చూసిన భారత ఫుట్‌బాల్ జట్టులో మహ్మద్ హబీబ్ కీలక సభ్యుడు. భారత జట్టుకు 35 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన ఆయన.. 11 గోల్స్ సాధించారు. 1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడాయన. హబీబ్‌ను.. భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్‌గా పరిగణిస్తారు. భారత్‌లో తొలి తరం ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్లలో ఆయన ఒకరు. 60వ దశకంలో క్లబ్ ఫుట్‌బాల్‌లో అడుగు పెట్టిన హబీబ్... 1968లో మోహన్ బగాన్ తరఫున ఆయన క్లబ్ ఫుట్‌బాల్‌లోకి అడుగు పెట్టారు.
ఈస్ట్ బెంగాల్ సహా తదితర స్పోర్టింగ్ క్లబ్‌లకు కూడా ప్రాతినిధ్యం వహించారు హబీబ్. అయితే మోహన్ బగాన్ తరఫున ఆయన ప్రదర్శనలు, సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఈ క్లబ్‌తో పాటు ఈస్ట్ బెంగాల్‌కు ఎన్నో మరపురాని విజయాలను అందించారు హబీబ్. కేవలం ఆయన ఆట చూడటానికే లక్షల మంది అభిమానులు స్టేడియాలకు భారీగా తరలి వచ్చేవారు. కోల్‌కతా వాసులు ఆయన్ని ముద్దుగా 'బడే మియా' అని పిలుచుకుంటారు. ఫుట్‌బాల్ క్లబ్‌లు ఆయన్ను దక్కించుకోవడానికి ఖాళీ చెక్కులు పట్టుకుని ఆయన వెంటే తిరిగేవారు. ఇంతటి ఘనత సాధించిన ఆయన ఇప్పుడు లేరనేసరికి బెంగాలీ వాసులు చాలా బాధపడుతున్నారు. హబీబ్ ఘనతలను గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.
