ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో సమరం కోసం దేశాలు, ఖండాలు దాటి పయనిస్తుంటారు. కుటుంబం కంటే ఎక్కువగా డ్రెస్సింగ్ రూమ్‌లోనే గడుపుతుంటారు. ఏడాది అంతా తీరికలేని షెడ్యూల్‌తో బిజీబిజీగా ఉంటుంటారు. ఈ సమయంలో కాస్త విరామం దొరికినా తమ ప్రేయసి, భార్యలతో సరదాగా గడిపేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎవరెవరి భార్యలు ఏం చేస్తుంటారో ఓ సారి చూద్దాం.
సంజనా గణేశన్
టీమ్‌ఇండియా అగ్రశ్రేణి పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ఓ క్రీడా ఛానెల్‌లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న సంజనా గణేశన్‌ను అతను వివాహమాడాడు. మోడల్‌గానూ రాణించిన సంజన తర్వాత యాంకర్ అవతారమెత్తింది. ప్రస్తుతం బ్యాడ్మింటన్, టెన్నిస్‌తో పాటు క్రికెట్ మ్యాచ్‌లకూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.
సాక్షి సింగ్ ధోనీ
టీమ్‌ఇండియా కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో రికార్డు విజయాలు అందించిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. అతని భార్య సాక్షి. హోటల్ మేనేజ్మెంట్ విద్యలో పట్టభద్రురాలు. మహీని పెళ్లాడకముందు కోల్‌కతాలోని తాజ్ బెంగాల్ హోటల్లో ట్రైనీగా పనిచేసేవారు. వీరిద్దరికీ 2010 జులై 4న వివాహమైంది. వీరికి జీవా అనే కూతురుంది. ప్రస్తుతం ధోనీకి సంబంధించిన విషయాలను చూసుకుంటూ బిజీగా గడిపేస్తోంది సాక్షి.
అనుష్క శర్మ
ప్రస్తుత టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ. బాలీవుడ్లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న అనుష్క.. వివాహం తర్వాత సినిమాల్లో కొనసాగుతున్నారు. వెబ్‌సిరీస్‌లకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
రితికా సజ్దే
భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే. ఈమె స్పోర్ట్స్ మేనేజర్. అంటే ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం, స్పోర్ట్స్ ఈవెంట్లు, మ్యాచ్‌లు నిర్వహిస్తూ ఉంటారు. క్రికెట్‌తో పాటు పలు క్రీడలపై రితికకు మంచి అవగాహన ఉంది. వీరిద్దరికీ సమైరా అనే పాప ఉంది.
హెజిల్ కీచ్
లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్, హార్డ్ హిట్టర్ యువరాజ్ సింగ్ సతీమణి హెజెల్ కీచ్. బాలీవుడ్లో నటిగా రాణించిన హెజెల్.. 'ఆ అంటే అమలాపురం' పాటలో నర్తించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2016 నవంబర్ 30న వీరిద్దరి వివాహం జరిగింది.
గీతా బస్రా
స్పిన్నర్ హర్భజన్ సింగ్ భార్య గీతా బస్రా. బాలీవుడ్లో ఇమ్రాన్ హష్మీ పక్కన 'దిల్ దియా హై' సినిమాతో తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'ద ట్రైన్', 'జిల్లా ఘజియాబాద్', 'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్' వంటి చిత్రాల్లో నటించారు. 2015లో వివాహం చేసుకున్న ఈ జోడికి హినయ హీర్ అనే కూతురు ఉంది.
ప్రియాంకా చౌదరి
భారత లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా సతీమణి ప్రియాంకా చౌదరి. ఈ ఆటగాడిని పెళ్లాడక ముందు నెదర్లాండ్స్‌లో ఐటీ ఉద్యోగినిగా పనిచేసేవారు. చిన్ననాటి నుంచే వీరిద్దరూ స్నేహితులు కాగా.. కొన్నేళ్ల ప్రేమ తర్వాత 2015లో వివాహం చేసుకున్నారు. 2016, మే 14న వీరిద్దరికీ ఓ పాప జన్మించింది. ఆమె పేరు గ్రేసియా రైనా.
విజేతా పెందార్కర్
టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ అయిన రాహుల్ ద్రవిడ్ భార్య విజేత. మిస్టర్ డిపెండబుల్‌గా పేరున్న ఇతడి సతీమణి మెడికల్ సర్జన్‌గా పనిచేసేవారు. వీరికి సమిత్, అన్వయ్ అనే ఇద్దరు తనయులు ఉన్నారు. సమిత్ ఇప్పటికే జూనియర్ స్థాయి క్రికెట్లో మంచి పేరు తెచ్చుకున్నాడు.
దీపికా పల్లికల్
భారత సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ సతీమణి దీపికా పల్లికల్. భారత స్వ్కాష్ ప్లేయర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పీఎస్ఏ మహిళల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటు దక్కించుకున్న తొలి భారతీయురాలిగా అరుదైన రికార్డు ఈమె సొంతం. అర్జున అవార్డు కైవసం చేసుకున్న మొదటి భారత మహిళా స్వ్కాష్ ప్లేయర్‌గా ఘనత సాధించారు. 2015 ఆగస్టు 18న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
అంజలీ తెందూల్కర్
భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ సతీమణి అంజలి. శిశు వైద్యురాలు(పీడియాట్రిషియన్) అయిన అంజలి.. సచిన్‌ను వివాహం చేసుకున్నాక కెరీర్‌ను విడిచిపెట్టేశారు. వీరిద్దరికీ సారా, అర్జున్ అనే పిల్లలున్నారు. అర్జున్ ఇప్పటికే జూనియర్ క్రికెట్లో ఆడుతున్నాడు.
అయేషా ముఖర్జీ
భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ భార్య అయేషా. కిక్ బాక్సర్, అథ్లెట్ అయిన ఈమె.. పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత ఆటలను వదిలేశారు. వీరికి జోరావర్, రియా, అలియా అనే ముగ్గురు పిల్లలున్నారు.
డోనా గంగూలీ
భారత జట్టు మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సతీమణి డోనా. ఒడిస్సీ నృత్యంలో ప్రావీణ్యురాలు. బంగాల్లో పుట్టిన ఈమె దీక్ష మంజరీ అనే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ను నడుపుతున్నారు. దీన్ని ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ ప్రారంభించారు. వీరికి సనా గంగూలీ అనే పాప ఉంది.
మయాంతీ లాంగర్
భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య మయంతీ లాంగర్. క్రికెట్ వ్యాఖ్యాత, జర్నలిస్ట్‌గా ఈమెకు మంచి పేరుంది. 2010 ఫిఫా వరల్డ్‌కప్, 2015 క్రికెట్ వరల్డ్‌కప్ సహా 2010 కామన్వెల్త్ గేమ్స్, 2011 క్రికెట్ వరల్డ్ కప్,2014 ఇండియన్ సూపర్‌లీగ్‌లో తన వ్యాఖ్యానంతో ప్రేక్షకులను మెప్పించారు. స్టార్ టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు మయంతి యాంకర్‌గా ఉన్నారు.
ప్రీతి నారాయణన్
టీమ్‌ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణి ప్రీతి నారాయణన్. ఇంజినీర్ అయిన ఈమె అశ్విన్‌తో పాటు ఒకే కళాశాలలో చదువుకున్నారు. ఈ జంటకు ఆద్య, అకిరా అనే ఇద్దరు పిల్లలున్నారు.
నుపుర్ నగర్
భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ భార్య నుపుర్. ఇంజినీర్ అయిన ఈమె నొయిడాలోని ఓ మల్టీనేషనల్ సంస్థలో ఉద్యోగినిగా సేవలందించారు.
తాన్యా వాధ్వ
భారత యువ పేసర్ ఉమేశ్ యాదవ్ సతీమణి తాన్యా. డిజైనర్ అయిన ఈమెకు ఫ్యాషన్ రంగంలో మంచి పట్టుంది.