టీమ్‌ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఇంట్లో విషాదం జరిగింది. ఉమేశ్ తండ్రి తికల్ యాదవ్ (74) బుధవారం రాత్రి కన్నుమూసినట్లు తెలిసింది. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడం వల్ల ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాగ్‌పుర్‌లోని కోలార్ రివర్‌ఘాట్ వద్ద ఆయన అంత్యక్రియలను నిర్వహించారు.
ఉత్తర్‌ప్రదేశ్ పాద్రౌనా జిల్లాలోని పోకర్బిందా గ్రామానికి చెందిన తికల్ యాదవ్ యువకుడిగా రెజ్లార్గా కెరీర్ కొనసాగించారు. ఎన్నో పోటీల్లో పాల్గొని గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్‌లో ఉద్యోగరీత్యా నాగ్‌పుర్‌లో సెటిల్ అయ్యారు. తికల్ యాదవ్‌కు ఉమేశ్ యాదవ్ కాకుండా కమ్లేష్, రమేశ్ అనే ఇద్దురు కుమారులతో పాటు ఓ కుమార్తె కూడా ఉన్నారు.
ఇకపోతే ప్రస్తుతం ఉమేశ్ యాదవ్ బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు ప్రకటించిన టీమ్‌ఇండియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే తొలి రెండు టెస్టుల్లో అతడు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక భారత్ - ఆసీస్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ మార్చి 1 నుంచి మొదలు కానుంది. మరి ఈ మ్యాచ్‌లోనైనా ఆడతాడో లేదో చూడాలి.
ఇదీ చూడండి: 'సన్‌రైజర్స్'కు కొత్త కెప్టెన్.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు బాధ్యతలు